ఖమ్మం సిటీ, ఏప్రిల్ 11 : ‘సీఎం కేసీఆర్ మాటంటే మాటే.. ప్రజా సంక్షేమం.. అభివృద్ధి.. అంశం ఏదైనా సరే హామీ ఇస్తే నెరవేరి తీరాల్సిందే.. ప్రధానంగా ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి ఆలోచనలన్నీ ఆచరణలోకి రావడం విశేషం.. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది.. ఖమ్మంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఆమోదముద్ర పడింది.. ఈ విద్యా సంవత్సరం నుంచే వంద మెడికల్ సీట్ల భర్తీ.. తరగతుల నిర్వహణకు పచ్చజెండా ఊపింది.. ఈ మేరకు మంగళవారం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉత్తర్వులివ్వడం గమనార్హం.. వారం రోజుల్లో పూర్తిస్థాయి అనుమతులు రానుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో మంత్రి అజయ్‌కుమార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. తాను కోరిన కాలేజీ కేవలం నెలల వ్యవధిలో సాక్షాత్కారం అవుతున్నదని సంతోషపడుతున్నరు..
ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా నెలకొల్పేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించుకోవచ్చని నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 100 సీట్లకు అనుమతినిస్తూ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. ఇదే విషయమై మంత్రి అజయ్‌కుమార్ కోరిక మేరకు గతేడాది తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఖమ్మానికి మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తరగతి గదులు, అన్ని రకాల ఛాంబర్లు, హాస్టల్స్ కోసమని పాత కలెక్టరేట్ భవన సముదాయం, గిరిజన సంక్షేమ అధికారి, పౌరసరఫరాల శాఖ, ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖల భవనాలతోపాటు ఈవీఎంలు దాచిపెట్టే గోదామును సైతం కేటాయించారు.
మెడికల్ కాలేజీకి అనుగుణంగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలుమార్లు ఖమ్మానికి వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు పెద్దాస్పత్రి, ఛాంబర్లు, తరగతి గదులు, హాస్టల్స్ కోసమని పునఃనిర్మిస్తున్న భవనాలను తనిఖీ చేసుకుని వెళ్లారు. ఎన్ఎంసీ నిబంధనలకు సరిపోవడంతో కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేదలకు అందనున్న కార్పొరేట్ వైద్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం 13 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, యూరాలజీ, జనరల్ సర్జన్ విభాగాలు కీలకమైనవి. కానీ.. గైనకాలజీ(ప్రసవాలు)ని మినహాయిస్తే మిగతా వార్డుల్లో సేవలు మధ్యాహ్నం వరకే పరిమితం. ఓపీ అయిపోయిన తర్వాత వైద్యులంతా ఇంటిదారి పట్టడం సర్వసాధారణం.
అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభం అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. అనేక రకాల విభాగాలు అందుబాటులోకి వస్తాయి. స్పెషలిస్ట్ వైద్యులు, ప్రొఫెసర్లు, మెడికోలు నిరుపేద రోగులకు బాసటగా నిలుస్తారు. అన్ని వార్డుల్లోనూ 24 గంటలపాటు వైద్య సేవలు లభించనున్నాయి. దీంతో పేదలకు నయాపైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల సైతం మంజూరు కానుండడంతో వైద్య సేవలు మరింత విస్తరించనున్నాయి. ఫోరెన్సిక్ పరీక్షలు సైతం ఖమ్మంలోనే జరుగుతాయి. అనాటమీ, ఫిజియాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ వంటి కీలక సేవలను పొందవచ్చు.
పేదలకు అందనున్న కార్పొరేట్ వైద్యం పెద్దాస్పత్రిలో సంబురాలు
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ నుంచి అనుమతి లభించడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు, ప్రభుత్వ వైద్య యంత్రాంగానికి, నూతనంగా చేరబోవు వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ రావడంతో పెద్దాస్పత్రిలో సంబురాలు అంబరాన్నంటాయి. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యంత్రాంగం కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇంత కాలానికి సాక్షాత్కారం అవుతున్నదని అన్నారు. దీనికంతటికీ కారకులైన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ, ఏవో డాక్టర్ కేసగాని రాజశేఖర్‌గౌడ్, డాక్టర్ బాలు, మినిస్టీరియల్ స్టాఫ్ ఏవో ఆర్వీఎస్ సాగర్, ఉద్యోగ సంఘ నాయకులు నందగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల ఏర్పాటుతో కల సాకారం – మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, ఏప్రిల్ 11 : ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రజలు, విద్యార్థుల కల సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుంచే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు 100 సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను విడుదల చేసిందన్నారు. దీనికి అంగీకారం తెలుపుతూ వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో అన్ని అనుమతులతో మెడికల్ కళాశాల ప్రారంభం కానున్న సందర్భంగా వైద్య విద్యార్థులు, ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.