మధిర, జూన్ 27 : నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. తొలుత సీహెచ్సీని ఐద్వా మధిర డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌర్రాజు ధనలక్ష్మి, చేగొండి వెంకాయమ్మ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో రోగులకు సరిపడా బెడ్లు, వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
పాత భవనం కావడంతో వర్షాలకు కురుస్తుండడంతో ఇటు రోగులు, అటు వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వంద పడకల దవాఖాన భవనం నిరుపయోగంగా మారిందని, వెంటనే దానిని ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.