వైరాటౌన్, ఏప్రిల్ 20 : అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కి మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఏన్కూరులోని ఓ కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ ఏన్కూరు, జూలురుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి పొరపాటు చేశామని గ్రహించిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేద్దామని ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజలతో మమేకమై బూత్‌స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే విజయం మనదేనన్నారు. అంబేద్కర్ జయంతి నాడు ఆయన విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయలేదని, అలాంటి కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రూ.8 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చానని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎక్కువ రోజులు హాజరై ఎక్కువ ప్రశ్నలు అడిగిన రికార్డు తనదేని నామా పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను ఓడించాలి :మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకొచ్చిందని, ఇలాంటి కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పార్టీ వైరా నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెట్టారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. సమావేశంలో జూలూరుపాడు జడ్పీటీసీ భూక్యా కళావతి, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, పోలుదాసు కృష్ణమూర్తి, రైతు నాయకులు యదళ్లపల్లి వీరభద్రం, చావా వెంకటరామారావు, ఏన్కూరు జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, ఎంపీటీసీలు వాసిరెడ్డి మోహన్‌రావు, బానోతు సరోజిని, మండల నాయకులు ఇంజం పుల్లయ్య, కొనకంచి వెంకటేశ్వర్లు, యండ్రాతి మోహన్‌రావు, పొన్నం హరికృష్ణ, వైరా మండల పార్టీ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్, నామా సేవా సమితి నుంచి పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, సరిపూడి గోపి, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నామా విజయానికి కృషి చేయాలి : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేసి ఎంపీగా నామా నాగేశ్వరరావు విజయానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అందరూ కష్టపడి పనిచేస్తే నామాకు 2 లక్షల మెజార్టీ ఖాయమన్నారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలన్నారు. నామా కష్టజీవి అని, ఆయన గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్‌వి 420 హామీలు : ఎమ్మెల్సీ తాతా మధు
420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కులు కాపాడాలంటే నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని, మరో 4 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందన్నారు. పదేళ్లు కేసీఆర్ అభివృద్ధితో సుభిక్ష రాష్ట్రంగా మారిస్తే.. కాంగ్రెస్ వచ్చి సంక్షోభంలోకి నెట్టిందన్నారు.