‘మధిర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడే కావాలంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు జడ్పీ చైర్మన్ పదవిని అందించారు. ఆ హోదాలోనే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే ఎంతో అధ్యయనం చేశాను. సమస్యలపై అధ్యయనం చేసే అలవాటు నాకు విద్యార్థి దశ నుంచే ఉన్నది. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి మధిర నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన ‘నమస్తే’తో కాసేపు ముచ్చటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్‌ను పంచుకున్నారు.
ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మధిర నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు అన్నారు. వచ్చిన పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావిస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన ‘నమస్తే’తో కాసేపు ముచ్చటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల మధ్యకు వెళ్తున్నానని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తున్నానని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్‌ను పంచుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
మధిర నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గంలో ఉంటూ, వారికి అందుబాటులో ఉండే నాయకుడిని కోరుకుంటున్నారు. నేను గత ఎన్నికల్లో ఓటమి పాలైనా సీఎం కేసీఆర్ నాకు జడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. జడ్పీ చైర్మన్‌గా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేశాను. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపిస్తే శాసనసభలో మధిర ప్రజల సమస్యలు మాట్లాడతా. వారి తరఫున వారి వాణిని వినిపిస్తా. నియోజకర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే ఎంతో అధ్యయనం చేశాను. అధ్యయనం చేసే అలవాటు నాకు విద్యార్థి దశ నుంచే ఉన్నది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కమల్‌రాజు ఉంటాడని ఇప్పటికే నాకు పేరున్నది. ముందు నుంచి నాలో పోరాట పటిమ ఉన్నది. సామాన్యుడిగా మొదలైన నా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలందరూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. వీరిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండన నేతలే ఎక్కువ. అందుకే ప్రజలు శాసనసభ్యుడంటే స్థానికంగా అందుబాటులో ఉండని వ్యక్తి అనే భావనలో ఉన్నారు.
వచ్చే ఎన్నికలు మధిర నియోజకవర్గానికి మంచి రోజులు తీసుకొస్తాయి. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఇక్కడి ప్రజలకు ఆదారాభిమానాలు ఉన్నాయి. అదే అభిమానంతో ప్రజలు నన్ను ఎన్నికల్లో గెలిపిస్తారు. ప్రజలు నన్నెప్పుడూ పెత్తనం చలాయించే వ్యక్తిగా చూడలేదు. స్నేహితుడిలా, తమ ఇంటి బిడ్డలా చూశారు. జడ్పీ చైర్మన్‌గా బాధ్యతగా పనిచేసి వారి నమ్మకాన్ని పొందాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశం వచ్చినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను.
నేను ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయితే ఖమ్మం- బోనకల్లు రోడ్డును నాలుగులైన్ల రహదారి చేస్తా. ముదిగొండ, బోనకల్లు, ఎర్రుపాలెం, చింతకాని, మధిర మండలాల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తా. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మంగా గోదావరిపై సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే మధిర రైతాంగానికీ మేలు జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే కృష్ణా జలాలే ఆధారం. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే గోదావరి జలాలూ తరలివస్తాయి. నియోజకవర్గం గోదావరి, కృష్ణా నదుల సంగమంగా మారనున్నది. ప్రజలు నిండు మనసుతో నన్ను ఎన్నికల్లో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నన్ను కలవాలంటే ప్రజలకు మధ్యవర్తుల అవసరం ఉండదు. నా ఫోన్ నంబర్‌కు ఒక్క కాల్ చేస్తే చాలు. అర్ధరాత్రైనా స్పందిస్తా. ప్రజలకు ఆ హక్కు ఉన్నది.