కారేపల్లి, ఏప్రిల్ 24 : బీఆర్ఎస్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని శుక్రవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముందనే నెపంతో ఆయన అరెస్ట్ చేయగా అక్కడి ఏసీపీ రవీందర్ రెడ్డి స్వయంగా తన వాహనంలో నర్సంపేట నుండి నెక్కొండ, తొర్రురు, ఖమ్మం మీదుగా కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి మేర్గు రాంబాబు ఉన్నారు. కాగా కారేపల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు లకావత్ రాము, గంగరబోయిన మురళి, దుంకెన రవీందర్లతో పాటు పలువురు నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిశారు.