పంట నష్టపరిహారం చెల్లింపులో దుర్వినియోగమైన నిధులపై కనీసం విచారణ జరపని కాంగ్రెస్ సర్కార్.. తాజాగా రెండో విడత నిధులనూ విడుదల చేసింది. అర్హులైన బాధిత రైతులకు మరోసారి మొండిచేయి చూపించింది. అనర్హులకు పరిహారం చెల్లించింది. మొదటి విడతలో అనర్హులకు పరిహారం అందించిన అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైనా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మిన్నకుండిపోయారు. విచారణ జరపలేదు. అక్రమాలపై కొరడా ఝుళిపించలేదు. పైగా మరో విడతలోనూ అదే ధోరణిలో అనర్హులకు పరిహారం అందించారు. దీంతో రెండో విడతలోనూ తమకు పరిహారం అందకపోవడంతో అర్హులైన బాధిత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అశ్వారావుపేట, అక్టోబర్ 18: అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు కట్ట గత జూలైలో కురిసిన అధిక వర్షాలకు కొట్టుకుపోయింది. ఆయకట్టు రైతులను తీవ్రంగా నష్టపరిచింది. వరదలకు ఆయకట్టు పొలాలపై ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పరిహారం అందించేందుకు నిర్ణయించింది. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది. అయితే, వరద బాధిత రైతులను గుర్తించడంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. కనీసం భూమి కూడా లేని రైతులను, ఇతర రాష్ర్టాల రైతుల్లోని రైతులను ఎంపిక చేసి పరిహారం మంజూరు చేశారు. అసలైన బాధిత రైతులను విస్మరించారు. ఒకే కుటుంబంలో 15 మందికి అసలు భూమి లేకున్నా అధికారులు పరిహారం చెల్లించడం గమనార్హం. ఇదే పరిస్థితి గుమ్మడవల్లి పంచాయతీలోనే ఎక్కువగా జరిగింది. పంట నష్టపోయిన బాధిత రైతుల గోడును అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయంపై కొందరు రైతులు ‘నమస్తే తెలంగాణ’కు సమాచారం అందించడంతో సెప్టెంబర్ 8న ‘అర్హులకు మొండిచేయి’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. పరిహారం పక్కదారి పట్టిన విషయం వెనుక రాజకీయ సిఫార్సులు ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. ‘నమస్తే’ కథనంపై కలెక్టర్ స్పందించి.. అర్హులైన రైతుల జాబితా పంపించాలని ఆదేశించారు. అయినా అర్హులను గుర్తించలేదు.
పెదవాగు బాధిత రైతులకు జీవో 2 ప్రకారం పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అప్పటికే అధికారులు ఎక్కువ మంది అనర్హులను ఎంపిక చేసి వారికి పరిహారం అందించారు. ఆ పరిహారం సొమ్ము సరిపోవడం లేదంటూ రెండో విడత మరికొన్ని నిధులను ప్రభుత్వం కేటాయించింది. మొదటి విడతలో బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి, ఖమ్మంపాడు, నారాయణపురం గ్రామాలకు చెందిన 303 మంది రైతులకు చెందిన 391.19 ఎకరాలకు పరిహారం కింద రూ.40,71,339 చెల్లించింది. ఇందులో ఇసుక మేటలు తొలిగించుకోవడానికి రూ.19,32,712, నష్ట పరిహారం కింద రూ.21,38,627 చొప్పున నిధులు మంజూరు చేసింది. వీటి చెల్లింపులో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. అర్హులైన రైతులను పక్కకు నెట్టి రాజకీయ సిఫార్సులతో భూమి లేని వారికి, పొరుగు రాష్ట్రంలో ఉండే వారికి పరిహారం చెల్లించారు. తాజాగా రెండో విడతలో వీరికే మరో రూ.14,73,407 నిధులను విడుదల చేసింది.
వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారాన్నే చెల్లిస్తాం. అర్హులైన రైతుల జాబితా ఎంపికలో మా ప్రమేయం ఏమీ ఉండదు.
నేను బాధ్యతలు నిర్వహించిన సమయంలో బాధిత రైతుల ఎంపిక జరగలేదు. పెదవాగు బాధిత రైతుల పరిహారం విషయంలో ఏవైనా ఫిర్యాదులు అందితే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి సూచనలతో తదుపరి చర్యలు తీసుకుంటాం.
పెదవాగు ఇసుక మేటలు వేయడంతో నాకున్న రెండెకరాల్లో పంటను నష్టపోయాను. పరిహారం చెల్లింపులో అధికారులు కనీసం మా భూమిని గుర్తించలేదు. కానీ.. భూమిలేని రైతులకు పరిహారం చెల్లించారు. ఒకే ఇంటి పేరుతో ఉన్న 15 మందికి పైగా పరిహారం చెల్లించారు. వారిలో ఎవరికీ సెంటు భూమి కూడా లేదు. అనర్హులకు పరిహారం అందించడంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
పెదవాగు వరదలకు మా పొలంలో ఇసుక మేటలు వేశాయి. కట్టకు అతి సమీపంలోనే మా పొలం ఉంది. అధికారులు సర్వే చేసినప్పటికీ పరిహారం మంజూరు కాలేదు. కానీ పొలం లేని వారికి పరిహారం చెల్లించారు. మా పొలంలో ఇసుక మేటలు వేసినా నష్ట పరిహారం రాలేదంటూ అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. మొదటి విడత పరిహారం చెల్లింపులోనే అక్రమాలు జరిగాయి. రెండో విడతలోనూ అలాగే జరిగింది.