కొత్తగూడెం టౌన్/ తిరుమలాయపాలెం, మార్చి 19: తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని పీడీఎస్యూ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ శాతం నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ ఆ సంఘం నాయకులు కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలోనూ బుధవారం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ.. విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామంటూ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. కేవలం 7.57 శాతం నిధులనే కేటాయించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు.
బడ్జెట్ కేటాయింపుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల హామీలు నెరవేర్చే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు. హామీల అమలులో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా నిధుల కేటాయింపు జరగలేదు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా విస్మరించారు. సంక్షేమ రంగానికి నిధుల కేటాయింపు జరగలేదు. అభివృద్ధి పథకాలకు చెప్పుకోతగ్గట్లుగా నిధులు ఇవ్వలేదు. కాగితాలపై లెక్కల కోసమే అన్నట్లుగా బడ్జెట్ ఉంది. పేద ప్రజల కలలు ఈ బడ్జెట్ ద్వారా నెరవేరేలా లేవు.
-ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఖమ్మం
ఆరు గ్యారెంటీలతోపాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచేలా ఉంది కాంగ్రెస్ బడ్జెట్. దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం సిగ్గుచేటు. పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసేలా ఉంది. నిరుపేదలను పూర్తిగా విస్మరించింది. గత కేసీఆర్ ప్రభుత్వం యాదవులకు లబ్ధి చూపితే.. ఈ బడ్జెట్లో వారి ఊసేలేకపోవడం దుర్మార్గం. పూర్తి అంకెల గారడీని తలపించే విధంగా ఉంది బడ్జెట్.
-కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, కొత్తగూడెం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రాష్ట్ర అభివృద్ధి అడ్రస్ గల్లంతవుతుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మొండిచేయి చూపారు. 420 హామీలు ఈ బడ్జెట్లో కనుమరుగయ్యాయి. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500, తులం బంగారం వంటి హామీలు బంగాళాఖాతంలో కలిపారు. రైతుకు రూ.15 వేలు, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు మంగళం పాడారు. వ్యవసాయం, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపు సరిగా లేదు.
-మానె రామకృష్ణ, బీఆర్ఎస్ నియోజకవర్గ బాధ్యుడు, భద్రాచలం