ఖమ్మం కమాన్‌బజార్, డిసెంబర్ 26 : కమ్యూనిస్టుల పురోగమనమే దేశానికి రక్ష అని, యావత్ దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సీపీఐ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. పుట్టుక నుంచే తమ పార్టీ అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నదని గుర్తుచేశారు. దాదాపు ఒకే సమయంలో అవిర్భవించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుందని విమర్శించారు. కానీ.. తాము మాత్రం కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశామని గుర్తు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం పారిశ్రామిక వేత్తల కోసం, సంపన్న వర్గాల కోసం పని చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ఎర్ర కవాతును నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన మహాసభలో పార్టీ నేతలు ప్రసంగిస్తూ పార్టీ పోరాట చరిత్రను వివరించారు. నేతలు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, మహ్మద్ మౌలాన, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎర్రా బాబు, జానీమియా, లతాదేవి తదితరులు పాల్గొన్నారు.