భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎండ కారణంగా ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉదయం పూటనే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కన్పించారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో భద్రాచలం, పినపాక, ఇల్లెందు స్థానాలు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఉన్నాయి.
దీనికితోడు భద్రాద్రి జిల్లా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం. దీంతో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజు ప్రత్యేక దృష్టితో నిరంతర పర్యవేక్షణ చేశారు. తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర ప్రముఖులు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. కలెక్టర్ ప్రియాంక, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్వంచలోనూ, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లినూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చుంచుపల్లి మండలం రాంనగర్లో ఒక పోలింగ్ బూత్‌లో 1,050 ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం తర్వాత కూడా 400 మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలో ఉన్న ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ తీరును కలెక్టర్ ప్రియాంక వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కొన్ని కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఓటర్లతో మాట్లాడారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ఆయా సమయాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ విడుదల చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. భద్రాచలంలో 64.72 శాతం, పినపాకలో 65.91 శాతం, ఇల్లెందులో 69.11 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా అశ్వారావుపేటలో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి.
భద్రాద్రి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మార్చి 16న షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి సోమవారం పోలింగ్ పూర్తయ్యే వరకూ అందరి సహకారంతో జిల్లా యంత్రాంగం అహర్నిశలూ శ్రమించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. శాంతిభద్రతల విషయంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.