ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 7: ఈ సారి జరిగే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయదుందుభి ఖాయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అనేక పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెం, రామన్నపేట గ్రామాల్లోని ఆయా పార్టీలకు చెందిన సుమారు 200 కుటుంబాల వారు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సమక్షంలో గురువారం ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తొలుత కాచిరాజుగూడెంలో సర్పంచ్ నాగమణి – రామారావు దంపతుల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 55 కుటుంబాల వారు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్యెల్యే కందాళ వారందరికీ గులాబీ జెండా కప్పి ఆహ్వానించారు. అనంతరం రామన్నపేటలో స్థానిక కార్పొరేటర్ బీ.నిరంజన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందాళ సమక్షంలో మరో 150 కుటుంబాల బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలందరూ సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. మరోసారి కూడా బీఆర్ఎస్ను ఆదరించి కేసీఆర్‌ను సీఎంగా దీవించాలని కోరారు. నేడు అనేక రాష్ర్టాల్లో సరైన విద్యుత్ లేదని, అక్కడ చీకట్లు అలుముకుంటున్నాయని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం వెలుగు విరజిమ్ముతున్నాయని వివరించారు. కాగా, కాచిరాజుగూడెంలో మేరీమాత విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే రూ.60 వేల ఆర్థిక సాయం అందించారు. బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, గూడ సంజీవరెడ్డి, లక్ష్మణ్‌నాయక్, అక్కినపల్లి వెంకన్న, ముత్యం కృష్ణారావు, పేరం వెంకటేశ్వర్లు, వెంపటి రవి, బాలునాయక్, సాహెబ్, మేదరిమెట్ల శ్రీనివాస్, మొర్రిమేకల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.