ఖమ్మం రూరల్, నవంబర్ 10: పగలూ ప్రతీకారాలకు బీఆర్ఎస్ ఎప్పటికీ దూరమేనని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పలకరింపులు, పనితనాలే తమ నైజమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌తో కలిసి మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బారీ రోడ్‌షోకు ఎమ్మెల్యే హాజరయ్యారు. తొలుత గ్రామ పొలిమేరలో స్థానిక మహిళలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. అనంతరం గ్రామంలో వీధివీధినా భారీ జనసందోహం మధ్య కందాళ రోడ్‌షో కొనసాగింది. గ్రామ సెంటర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని అన్నారు. వాటి ద్వారా లబ్ధిని అందుకున్న ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ గెలిపించాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలో తనకు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు పాలేరు ప్రజలను డబ్బుతో కొనాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెల్దారుపల్లి గ్రామ రోడ్‌షోలో ఓపెన్ టాప్ జీప్‌లో ఉండి ఎమ్మెల్యే చేసిన ప్రసంగాన్ని అక్కడి వృద్ధులు శ్రద్ధగా విన్నారు. వీరిని గమనించిన కందాళ.. తవారుత ఓపెన్‌టాప్ జీప్ దిగి నేరుగా వృద్ధుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. ‘పెద్దాయనా.. ఇంతకాలం సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉంది? బీఆర్ఎస్ పాలనలో మీకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా?’ అని అడిగారు. దీనికి వృద్ధులు స్పందిస్తూ.. ‘ఇప్పుడంతా సల్లగా ఉన్నాం. మాకు ఎంతో సాయం చేశారు. మా ఊరికి మీరు ఎంతో మేలు చేశారు. మీకు తప్పకుండా అండగా ఉంటాం.’ అని అన్నారు.