కూసుమంచి, నవంబర్ 11: పాలేరు నియోజకవర్గమంతటా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణలోనూ, పాలేరులోనూ మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గమంతటా దళితబంధు పథకాన్ని అమలుచేస్తామంటూ ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. మంచి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. తాను కూడా నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయాన్ని అందించానని గుర్తుచేశారు.
కూసుమంచి మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. సంధ్యాతండా, లాల్‌సింగ్‌తండా, తుమ్మలతండా, గైగోళ్లపల్లి, ఉడతలగూడెం, హట్యాతండా, చింతలతండా, పోచారం, వెంకట్రాంపురం, ముత్యాలగూడెం, చేగొమ్మ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికుడిగా ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన తనను ఈ ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. గ్రామాల్లోని అనేక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రావతి మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్ది వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రామసహాయం బాలకృష్ణారెడ్డి, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబీ, బాణోత్ రాంకుమార్, వేముల వీరయ్య, మల్లీడి వెంకటేశ్వర్లు, ముల్కూరి శ్యాంసుదర్‌రెడ్డి, శశికళ, వెంకట్, పుట్టా అంజయ్య, మంగ్యానాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.