కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 17: ఉమ్మడి పాలనలో ఎడారి ప్రాంతంగా ఉన్న పాలేరులో కరువును రూపుమాపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. నేలకొండపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలమైందని అన్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి టూరిస్టు నేతలు వచ్చి బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని, వారు గతంలో పదవిలో ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రజలు అలాంటి నేతలను పక్కన పెట్టాలని కోరారు. పేదలకు అండగా ఉండి, వీలైనంత సాయం అందిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ మాట్లాడుతూ.. నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్‌ను పొగిడిన వ్యక్తులు, నేడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి సంభాని మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బానోతు చంద్రావతి, మరికంటి ధనలక్ష్మి, నంబూరి శాంత, లీలా ప్రసాద్, ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.