ఖమ్మం, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘గొప్ప పనులు చేసిన వారిని ప్రజలెప్పుడూ గొప్పవారిగానే చూస్తారు. అవకాశవాదులు మాత్రం ఎప్పుడూ ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ.. గొప్పవారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది’ అని పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో మాట్లాడారు. ‘2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మూడో విజయం సాధించేందుకు తహతహలాడుతోంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇటు అభివృద్ధి, అటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నందునే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అని పేర్కొన్నారు. కానీ.. ఇక్కడ మాత్రం ఒక నాయకుడేమో గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాదాలు కడుగుతానని బీరాలు పలుకుతున్నాడు.. ఇంకో నాయకుడేమో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ గేటు తాకనివ్వబోను అని శపథం చేస్తున్నాడు. ఈ మాటలను చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. నేను నిజాం కాలేజీలో చదువుకున్న రోజుల్లో పాలేరులో పరిస్థితులు మార్చాలని తనవంతుగా కందాళ ఫౌండేషన్ అనే సంస్థ పేరుతో ఎంతో కృషి చేశాను. కానీ.. అది ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సరిపోలేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే పాలేరు నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. వ్యవసాయంతోపాటు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది’ అని వివరించారు.
‘మిషన్ కాకతీయ’ పథకంలో భాగంగా పాలేరు నియోజకవర్గవ్యాప్తంగా 120 చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. చెరువుల బలోపేతానికి ప్రభుత్వం రూ.26 కోట్ల నిధులు వెచ్చించింది. చెరువు కట్టలు బలోపేతం కావడంతో వానకాలంలో పంటలకు వరద ముప్పు తప్పింది. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. బావుల్లో సమృద్ధిగా నీరు ఊరుతున్నది. సాగునీటికి ఢోకా లేకుండాపోయింది.
నియోజవర్గ పరిధిలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ పరిధిలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. తొలుత అద్దె భవనాల్లో నడిచినప్పటికీ ప్రస్తుతం మూడింటికీ సొంత భవనాలు సమకూరాయి. ఆయా విద్యాలయాల్లో ప్రస్తుతం 1,100 మంది బాలికలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ పథకంతో నియోజకవర్గ పరిధిలోని పల్లెలు అభివృద్ధి బాట పట్టాయి. రూ.16.92 కోట్లతో సర్కార్ నియోజకవర్గవ్యాప్తంగా 141 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించింది. 141 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, 141 నర్సరీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రజారోగ్య సంరక్షణ కోసం నియోజకవర్గవ్యాప్తంగా 30 పల్లె దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి.
రైతుబంధు పథకం ద్వారా ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా 3,16,922 మందికి రైతుబంధు అందుతున్నది. అలాగే వివిధ కారణాలతో నియోజకవర్గవ్యాప్తంగా 1,235 మంది రైతులు మృతిచెందారు. ఒక్కో మృతుడికి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.61.75 కోట్ల బీమా అందజేసింది. కల్యాణలక్ష్మి ద్వారా ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా 2,325 మంది లబ్ధిదారులకు రూ.23.27 కోట్ల సొమ్ము అందింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు సుమారు 7,500 వేల మంది బాధితులకు ఆర్థిక సాయం అందింది.
దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా 100 ఎస్సీ కుటుంబాలకు 100 యూనిట్లు అందాయి. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహన యూనిట్లు తీసుకున్నారు. అలాగే రైతులకు సేవలు అందించేందుకు సర్కార్ నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్లతో 29 రైతువేదికలు నిర్మించింది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మొదటి విడుత ‘మన ఊరు-మన బడి’ పథకానికి నియోజకవర్గవ్యాప్తంగా 75 పాఠశాలలు ఎంపికయ్యాయి. సర్కార్ విడుదల చేసిన రూ.30 నిధులతో అధికారులు ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆయా పాఠశాలల్లో ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్కో పాఠశాల కార్పొరేట్ స్థాయిలో వసతులు సమకూర్చుకుంటున్నది. అలాగే నియోజకవర్గంలో రవాణావ్యవస్థను మెరుగుపరిచేందుకు సర్కార్ రూ.250 కోట్లతో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో రహదారులు నిర్మించింది. అలాగే పాలేరు మండల కేంద్రంలోని ఇన్‌టేక్ వెల్ ద్వారా ఖమ్మం జిల్లా 2,75,354 ఇండ్లకు మిషన్ భగీరథ నీరు అందుతున్నది.
పాలేరు నియోజకవర్గంలోని ఎక్కువ భాగం నాడు కరువు ప్రాంతం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా దీనికి పేరుండేది. సాగునీటి వసతి లేక రైతులు తమ భూముల్లో ఆముదం, జొన్నలు మాత్రమే సాగు చేసేవారు. అది కూడా ఏడాదిలో ఒక్క వానకాలం సీజన్లో మాత్రమే. ఇక వరి, మిర్చి, పత్తి వంటి పంటల ప్రశ్నే లేదు. అప్పుడు ఎకరా భూమి విలువ కేవలం రూ.2 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇక్కడి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపాలనుకున్నారు. ఎత్తిపోతల ద్వారా పాలేరు జలాశయం నుంచి జలాలు మళ్లించాలనుకున్నారు. 16 ఫిబ్రవరి 2016న సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పనులను ప్రారంభించారు. రూ.335.59 కోట్లతో జలాశయం నుంచి ఇరిగేషన్ అధికారులు తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్‌తండా వరకు 8 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించారు. 27 జనవరి 2017న సీఎం కేసీఆర్ ఎత్తిపోతలను ప్రారంభించారు. కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్‌గా భక్తరామదాసు పథకానికి పేరున్నది. ఇస్లావత్‌తండా నుంచి శ్రీరాంసాగర్ కాలువల ద్వారా తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, పాలేరు, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల్లోని 79,500 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం ఇక్కడి రైతులు ఆకుకూరలు, కూరగాయలు, వరి, మిర్చి, పత్తితో పాటు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.35 లక్షల వరకు పలుకుతున్నది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు అంతకంటే ఎక్కువ ధరలే పలుకుతున్నాయి. భూముల ధరలు అమాంతం పెరిగింది. ఏటా రెండు పంటలు పండుతుండడంతో వేలాది మంది వ్యవసాయకూలీలకు కూలి దొరుకుతున్నది. అలాగే సర్కార్ రూ.64.50 కోట్లతో పాలేరు పాత కాలువను ఆధునీకరించింది.
పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రం ఏళ్ల నుంచి మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు కోసం మత్స్యపెంపకంలో పరిశోధనలు చేస్తున్నది. పరిశోధనలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూసుమంచి మండలం జుఝల్రావుపేట పరిధిలోని మల్లాయిగూడెం రహదారి పక్కన 10 ఎకరాల్లో మత్స్య కాలేజీ నిర్మించనున్నది. తద్వారా వందలాది మంది విద్యార్థులు ఫీషరీస్ కోర్సు చదువనున్నారు. రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటి మత్స్యకళాశాల కావడం విశేషం. అలాగే ఖమ్మంలోని ప్రధానాసుపత్రికి అనుసంధానంగా నడుస్తున్న వైద్యకళాశాలకు అనుసంధానంగా ఖమ్మం రూరల్ మండలంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటైంది. అలాగే ఇదే మండలంలో ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఇంజినీరింగ్ విభాగంలో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి.