భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం టౌన్/ మణుగూరు టౌన్/ కూసుమంచి/ మామిళ్లగూడెం/ కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 28: ఇంధనం లేకుండా బతుకుబండి కదలని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏర్పడిన ఆయిల్ కొరతతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఆయిల్ కోసం అరికోస పడుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పుడే ఇంధన కొరతపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. కొరతేమీ లేదని, తగినన్ని నిల్వలున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నా అనుమానాలు నివృత్తి కాలేదు.
ఎట్టకేలకు కొద్దిరోజులపాటు చమురు పుష్కలంగా దొరకడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, నాలుగు రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరత జిల్లా ప్రజలను, వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. యుద్ధం కొనసాగుతుండడం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చముదు ధరలను కేంద్రం భారీగా పెంచనుందనే కథనాలు వెలువడడం వంటి కారణాల నేపథ్యంలో జిల్లాలో ఒక్కసారిగా తీవ్రమైన ఆయిల్ కొరత ఏర్పడింది.
నాలుగు రోజుల క్రితం రాత్రికి రాత్రే బంకుల్లో ఖాళీ అయ్యాయి. ‘నో స్టాక్’ అంటూ చాలామంది బంకుల యజమానులు తమ బంకుల ఎదుట బోర్డులు పెట్టారు. అయితే, సకాలంలో డీడీలు చెల్లించిన కొందరు యజమానులకు మాత్రమే ఆ మేరకు పరిమిత సంఖ్యలో ట్యాంకర్లు వచ్చాయి. దీంతో ఆయా బంకులు తెరుచుకున్నప్పటికీ.. జనం రద్దీ దృష్ట్యా వాటిల్లోనూ వెనువెంటనే నిల్వలు అయిపోతున్నాయి. అయితే, ఇంధన కొరత, ధరల పెంపుదల వంటి ముందస్తు సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలోని చాలామంది బంకుల యజమానులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే ఉన్న నిల్వలు అయిపోయాక వచ్చే స్పష్టతను బట్టి తదుపరి డీడీలు చెల్లించవచ్చుననే ఆలోచనతో చాలామంది డీలర్లు.. చమురు సంస్థలకు ముందస్తుగా డీడీలు చెల్లించలేదు. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇంతలా ఇంధన కొరత ఏర్పడడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా ఉంది.
మొత్తానికి పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఉమ్మడి జిల్లాలోని చాలా పట్టణాల్లో పోలీసుల బందోబస్తు మధ్య వాహనాల్లో ఇంధనం నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయిల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద పగలూ రాత్రీ తేడా లేకుండా భారీ క్యూలు కన్పిస్తూనే ఉన్నాయి. సిబ్బంది కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఇంధర కొరత ఇంకా తీవ్రమవుందేమోననే భయంతో చాలామంది వాహనదారులు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. మరికొంతమంది క్యాన్లలో తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది పెట్రోల్ లేనిదే వాహనం కదలని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అయితే, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ వంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, పొరుగునే ఉన్న ఆంధ్రాలో రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత తీవ్రంగా ఉండడంతో సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బంకులకూ అక్కడి వాహనాలు వస్తుండడం గమనార్హం.
జిల్లాలో ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఇంధన సరఫరా, ధాన్యం కొనుగోలు, ఎస్ఐఆర్ మ్యాపింగ్ అంశాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంధన కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ పనుల కోసం రైతులకు ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టాలని ఆదేశించారు. అలాగే, ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని సూచించారు.
పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతపై నిఘా ఉందని, ప్రజలు ఆందోళన చెందరాదని ఖమ్మం సీపీ సునీల్‌దత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికి లేదని నిరాకరించినా.. లేదా అధిక ధరలకు విక్రయించినా వెంటనే స్థానిక పౌరసరఫరాల అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత లేదని అన్నారు. అపోహలు నమ్మి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోరాదని, అవసరమైన మేరకు కొనుగోలు చేయాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయించాలనే దురుద్దేశంతో కృత్రిక కొరత సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, వారిపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ లేదని నిరాకరించినా, అధిక ధరలకు విక్రయించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇండ్లలో నిల్వ చేసుకోవద్దని, అవసరం మేరకే కొనుగోలు చేయాలని కోరారు.