భద్రాచలం, డిసెంబర్ 17 : ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం రామాలయం వద్ద ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ డాక్టర్ వినీత్తో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నామని, ఆఫ్లైన్లో కూడా టికెట్ల అమ్మకానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో కొన్ని టికెట్లు మాత్రమే ఉన్నాయని, ఆసక్తి గల భక్తులు బుక్ చేసుకోవాలని చెప్పారు. 22న గోదావరిలో జరిగే తెప్పోత్సవం, 23న నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా సెక్టార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సెక్టార్లో పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్లపైకి వచ్చిన దుకాణాలను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అనంతరం సెక్టార్లను పరిశీలించి దేవస్థానం అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ డాక్టర్ జీ.వినీత్ మాట్లాడుతూ ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు గంట ముందుగానే వారికి కేటాయించిన సెక్టార్లకు చేరుకోవాలన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 22, 23వ తేదీల్లో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఆర్డీవో మంగీలాల్, మండల ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఈ రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.