కారేపల్లి, మే 05 : మావోయిస్టుల అంతం పేరుతో గిరిజనుల ప్రాణాలు తీసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు భూక్య బావ్‌సింగ్ మూడో వర్ధంతి సభ ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని నానునగర్ తండాలో సోమవారం నిర్వహించారు. పార్టీ మండల కమిటీ సభ్యుడు యనమనగండ్ల రవిబాబు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో వీరభద్రం మాట్లాడుతూ.. మావోయిస్టుల అంతం పేరుతో గిరిజనులను తమకు ప్రాణప్రదమైన అడవి నుంచి వెళ్లగొట్టి అటవీ సంపదను, ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలనే వ్యూహంలో భాగమే ఆపరేషన్ కగార్ అని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని, గిరిజనులకు ప్రత్యేకమైన 1/70 చట్టాన్ని కాలరాసే విధంగా నకిలీ గ్రామ సభలు పెట్టి బెదిరించి పీసా చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనుల పట్ల, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
మావోయిస్టుల సమస్యను సామాజిక సమస్యగా కాకుండా శాంతి భద్రతల సమస్యగా చూడటం దుర్మార్గమన్నారు. దీనికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్టం అమలు జరపకుండా అటవీ రక్షణ నిబంధనల చట్టం పేరుతో గిరిజనులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు జరపకపోగా, లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. తాగు, సాగునీటి సమస్య, కరెంటు, రేషన్ కార్డులు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని ఎద్దేవ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వల్లబోయిన కొండలరావు, అజ్మీర శోభన్ బాబు, మన్యం బ్రహ్మయ్య, భీమ, భూక్య హరిచందర్, భూక్య సైదులు, మాజీ సర్పంచ్ రామ్ జీ, హర్జ, రూప్ సింగ్ పాల్గొన్నారు.