లండన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) కోమాలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన వార్తాపత్రిక ‘ది సన్’ పేర్కొంది. దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ఒకటి లేదా రెండు కాళ్లను కోల్పోయినట్లు తెలిపింది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ కూడా ఈ వాదనకు మద్దతు ఇచ్చారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన మోజ్తాబా ముఖం కూడా వికృతంగా మారి ఉంటుందని ప్రెస్ బ్రీఫింగ్లో ఆయన అన్నారు.
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆయన కుమారుడైన 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో లేదా ఆ తర్వాత జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడినట్లు బ్రిటీష్ టాబ్లాయిడ్ ‘ది సన్’ పేర్కొంది. టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో గట్టి భద్రత మధ్య ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
మరోవైపు మొజ్తబా ఖమేనీ చికిత్స గురించి ఒక ఇరాన్ నేత వివరాలు వెల్లడించినట్లు ‘ది సన్’ తెలిపింది. ‘మా నాయుకుడు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నారు. ఒకటి లేదా రెండు కాళ్ళు తెగిపోయాయి. కాలేయం, కడుపు కూడా చీలిపోయింది. ఆయన స్పష్టంగా కోమాలో ఉన్నారు’ అని ఆ ఇరాన్ నేత అన్నట్లు పేర్కొంది. ఇరాన్ ఆరోగ్య మంత్రి, యుద్ధ గాయాలకు చికిత్స చేసిన అనుభవం ఉన్న సీనియర్ సర్జన్, అనుభవజ్ఞుడైన ట్రామా సర్జన్ మొహమ్మద్ రెజా జఫర్ఘండి పర్యవేక్షణలో మొజ్తబా ఖమేనీకి చికిత్స కొనసాగుతున్నట్లు వార్తా కథనంలో పేర్కొంది.
కాగా, సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుంచి ప్రత్యక్ష ఆదేశాలు లేకుండానే ఇరాన్ నాయకత్వ నిర్మాణం యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లు ఆ నేత స్పష్టం చేశారని ‘ది సన్’ తెలిపింది. చురుకైన నాయకుడు లేకుండా కూడా ఇరాన్ సైనిక కార్యకలాపాలు కొనసాగే వ్యవస్థను అయతుల్లా అలీ ఖమేనీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ‘ఆయన తండ్రి ఒక వ్యవస్థను వదిలి వెళ్ళాడు. ఒక దెయ్యం నడిపేలా అది ఉంది. అందుకే ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇప్పటికీ ఎగురుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగుతున్నది’ అని ఆయన అన్నట్లు ‘ది సన్’ పేర్కొంది.
అయితే ‘ది సన్’ వార్తా కథనంపై ఇరాన్ స్పందించలేదు. పైగా కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలి సందేశం పేరుతో గురువారం ఒక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. ఇరానియన్ల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని, హార్ముజ్ జలసంధిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించినట్లుగా టీవీ వ్యాఖ్యాత దీనిని చదివి వినిపించారు.
Also Read:
Mojtaba Khamenei | అమరవీరుల ప్రతీకారం తీర్చుకుంటాం.. హార్ముజ్ జలసంధి మూసేస్తాం: మోజ్తాబా ఖమేనీ
Mosaic Defence | ఇరాన్ రక్షణ కోట ‘మొజాయిక్ డిఫెన్స్’.. ఈ యుద్ధ వ్యూహానికి ఆద్యుడు ఈయనే..!
Explosion Rocks Tehran | ఇరాన్ రాజధానిలో భారీ నిరసన ర్యాలీ.. ఇజ్రాయెల్ దాడుల్లో మహిళ మృతి