 
                                                            ఖమ్మం/ ఖమ్మం సిటీ, అక్టోబర్ 30: ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ సహా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ఆపద మిత్రలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆపదలో ఉన్న వారికి, వరద చుటుముట్టిన ఇళ్లలో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం అందించారు. నయాబజార్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్, డీఎంహెచ్వో కళావతీబాయి వేర్వేరు పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మొంథా తుపాను వరదల సమయంలో ఖమ్మంలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ఆపదమిత్రల సేవలను కలెక్టర్ అనుదీప్ ప్రశంసించారు.
జిల్లాలో 300 మంది యువతీయువకులను ఆపద మిత్రలుగా ఎంపిక చేసి గతంలో వారికి శిక్షణ ఇచ్చామని, వారంతా తాజా వరదల్లో విశేషమైన సేవలందించారని అన్నారు. వరద వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటున్న 47, 48 డివిజన్ల ముంపు ప్రాంతాల ప్రజలకు 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు దంపతులు అన్నదానం చేశారు. మున్నేరు శాంతించాలంటూ మున్నేటి ఒడ్డున ఉన్న గంగమ్మతల్లికి పూజలు చేశారు. గురువారం సాయంత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో పర్యటించారు. మున్నేరు పాత వంతెన పైనుంచి వరద ఉధృతిని పరిశీలించారు. నయాబజార్ సూల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోని వరద బాధితులతో మాట్లాడారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఖమ్మం నగరానికి మున్నేరు వరద గండం నుంచి శాశ్వత పరిషారం లభిస్తుందని అన్నారు.
 
                            