తిరుమలాయపాలెం, నవంబర్ 9: కేసీఆర్ ప్రభుత్వ పథకాలే తన గెలుపునకు నాంది అని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ప్రజలందరూ తమ వెంటే ఉన్నారని తేల్చిచెప్పారు. తిరుమలాయపాలెంలో గురువారం పర్యటించిన ఆయన.. ఏనుకుంటతండా, కాకరవాయి, సోలీపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ ప్రజలందరికీ అందాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు పొందిన ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు.
పాలేరు గెలుపుపై ప్రత్యర్థి పార్టీలు భ్రమలు వదులుకోవాలని హితవుపలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాగానే మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని వివరించారు. రైతుబీమా తరహాలోనే పేదలందరికీ రూ.5 లక్షల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తామని తెలిపారు. తెల్లకార్డుదారులందరికీ సన్నబియ్యం అందజేస్తామని ప్రకటించారు. అర్హులైన పేద మహిళలకు ప్రతినెలా రూ.3000 గౌరవభృతి అందిస్తామన్నా. రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బాషబోయిన వీరన్న, దేవరం దేవేందర్‌రెడ్డి, కందాళ స్టాలిన్‌రెడ్డి, చావా వేణు, వీరబోయిన మౌనిక శ్రీనివాస్, బానోత్ రమేశ్, బానోత్ రవి, హళావత్ బిక్కు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించారు.