ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 23 : జిల్లాలోని మిర్చి సాగు రైతులకు, వ్యాపారులకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది వింత అనుభవం ఎదురవుతున్నది. సాధారణంగా అన్ సీజన్లో ఏసీలో నిల్వ పెట్టుకున్న మిర్చి పంటకు.. సాధారణ పంట కంటే డబుల్ రేటు పలుకుతుంది. కానీ.. ప్రస్తుతం కొత్త మిర్చి పంటకు, ఏసీ రకం మిర్చి పంటకు ఒకే ధర పలుకుతుండడంతో రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొన్నది. గత ఏడాది పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్లో సాధారణ పంట ధర క్వింటా రూ.18 వేల నుంచి రూ.20 వేలు పలికింది.
అయితే అప్పటికే కోల్డ్ స్టోరేజీలలో నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో రాబోయే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందని కొందరు రైతులతోపాటు అనేక మంది మిర్చి ఖరీదుదారులు రైతుల వద్ద పంట కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా 38 కోల్డ్ స్టోరేజీలలో సుమారుగా 40 లక్షల బస్తాలను నిల్వ చేశారు. మరికొందరు రైతులు భవిష్యత్ సంగతి ఎలా ఉంటుందో అంచనా వేయలేమనే ఉద్దేశంతో తమ సరుకును అమ్ముకున్నారు. సీన్ కట్ చేస్తే.. ఏడెనిమిది నెలల తర్వాత ప్రస్తుతం ఏసీ రకం పంటకు క్వింటా గరిష్ఠ ధర రూ.16,625 పలుకుతున్నది.
దీంతో క్వింటా ఒక్కంటికి రూ.3 వేల నుంచి రూ.4 వేలు ధర తగ్గడంతోపాటు అదనంగా కోల్డ్ స్టోరేజీలకు కిరాయి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ పరిధిలోని 3-4 పెద్ద ఖరీదుదారులు రూ.కోట్లలో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి దాపురించింది. నిల్వ చేసుకున్న రైతులకు సైతం లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి కొత్త పంట మార్కెట్కు వస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో మూడు, నాలుగు రోజుల నుంచి భారీగా ధర తగ్గినప్పటికీ మరింత పడిపోతుందా.. అనే ఉద్దేశంతో సరుకును అమ్మకానికి పెడుతున్నారు. కొత్త పంటకు సైతం ప్రస్తుతం క్వింటా గరిష్ట ధర కేవలం రూ.16,200 మాత్రమే పలుకుతున్నది. సీజన్ నాటికి ఈ ధర ఇలానే ఉంటుందా? మరింత పడిపోతుందా? అనే ఆందోళనలో మిర్చి రైతులు ఉన్నారు.