ఖమ్మం, మే 1 : వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీట్ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2,739 మంది విద్యార్థులు ఆరు కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గం టల వరకు ఉంటుందని, విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
సీసీ టీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. అభ్యర్థులందరూ మధ్యాహ్నం 1.30లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పేరొన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని, ఇన్విజిలేటర్ ఒక కాపీ అడ్మిట్ కార్డు కలెక్ట్ చేసుకుంటారని తెలిపారు. అభ్యర్థులు https://neet.nta.nic.in పోర్టల్ నుంచి నీట్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, పోస్ట్ కార్డు సైజు ఫొటో, ఫొటోతో కూడిన ఒరిజినల్ గుర్తింపు కార్డు(ఆధార్, పాన్, రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్) తప్పనిసరిగా తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, విద్యార్థినులు ఆభరణాలు ధరించవద్దన్నారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, నీట్ పరీక్ష జిల్లా నోడల్ అధికారి నరేంద్ర, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈ నెల 4న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వర కు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ -2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. యాక్ట్ అమలులో ఉన్న సమయంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని సూచించా రు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకు లు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దని పేరొన్నారు. పరిసరాల్లోని ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని, ఈ విషయంలో అన్ని వర్గాలు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.