ఖమ్మం, అక్టోబర్ 11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సమగ్ర గ్రామీణ విధాన సంస్కరణల ఫలితంగా పల్లెల ముఖచిత్రమే అద్భుతంగా మారిపోయిందని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న ఏన్కూరు మండలం నూకాలంపాడు సర్పంచ్ శేషగిరిరావును మంగళవారం ఖమ్మంలోని తన స్వగృహంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి ఎంపీ అభినందించారు.
ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంతర శ్రమ, దార్శనికతతో అన్నిరంగాల్లో అపూర్వ పురోగతి సాధించి ప్రగతిపథంలో పయనిస్తున్నాయన్నారు. సుపరిపాలన, ఆరోగ్యకరమైన వాతావరణం, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రత, సామాజిక భద్రతతోపాటు నీటి సమృద్ధితో పల్లెలు కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే ఇదంతా సాధ్యమైందని, అందుకు నిదర్శనమే కేంద్రం ప్రకటించిన అవార్డులు అని అన్నారు. గ్రామాల ప్రగతి వేదికగా పల్లె ప్రగతి కార్యక్రమం నిలిచిందన్నారు. సుస్థిర అభివృద్ధితో గ్రామాలు ప్రగతి సాధించడం దేశానికే గర్వకారణమన్నారు. అభివృద్ధికి కారణమైన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.