ఇల్లెందు, జనవరి 2: ప్రాణాలకు తెగించి.. తెలంగాణ సాధించి.. పదేళ్లు పాలించి.. రైతుల పక్షాన నిలిచి.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేదల దరిచేర్చారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనతోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా తెలంగాణ పోరాటంలోనూ, వికాసంలోనూ తమదైన పాత్ర పోషించారు. అందుకని వీరిని అభిమానిస్తూ నిత్యం ఆరాధిస్తున్నాడు ఓ యువ రైతు.. అందుకు గుర్తుగా ఏకంగా వీరికి తన గుండెలపై స్థానమిచ్చాడు. వీరి పేర్లను తన ఛాతీపై పచ్చబొట్టుగా ముద్రించుకొని అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక వారి పేర్లు కూడా ప్రతి రోజూ తనకు పచ్చగా కనిపించాలని తపించాడు. ఇందుకోసం తన పంట చేలోని మొక్కజొన్న పైరులోని కొన్ని మొక్కలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్లుగా అక్షరమాల రూపంలో రాశాడు. వాటికి నిత్యం నీరు పోస్తుండడంతో అవి పచ్చగా ఎదుగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మూడ్‌తండాకు చెందిన మూడ్ రమేశ్, రాంబాయి దంపతులది వ్యవసాయం కుటుంబం. తమకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు సరిగా లేక వారి చేలో ఒక పంటను మాత్రమే పండించేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల కాలంలో 24 గంటలపాటు విద్యుత్ ఇవ్వడంతో ఎకరం భూమిలో మూడు రకాల కూరగాయల పంటలు సాగు చేశారు. తమకు ఇంత చేసిన కేసీఆర్ ఎప్పుడూ తమ కళ్లముందే ఉండాలని వారు తపించిపోయారు.
ఇందుకోసం సదరు యువ రైతు రమేశ్.. తన గుండెలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్లు పచ్చపొడిపించుకున్నాడు. ఎడమ చేతిపై కూడా రాయించుకున్నాడు. ఇంకా తను సాగు చేస్తున్న ఎకరం మొక్కజొన్న తోట మధ్యలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పేర్లను రాశాడు. దానిలో మొక్కజొన్న గింజలు నాటాడు. ప్రతిరోజూ తోటకు వచ్చిన రమేశ్, రాంబాయి దంపతులు తమ తోటతోపాటు తమ అభిమాన నేతల పేర్లు ఉన్న మొక్కలనూ సంరక్షిస్తున్నారు. తమ ఆరాధ్య నేతల పేర్లు పచ్చగా ఎదుగుతుండడాన్ని చూసి మురిసిపోతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వారు రైతుల హృదయాలలో సుస్థిరంగా నిలిచిపోతారని యువ రైతు రమేశ్ పేర్కొన్నాడు.