కొత్తగూడెం గణేష్టెంపుల్/ ఇల్లెందు/ అశ్వారావుపేట, జనవరి 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఆయా మున్సిపల్ అధికారులు సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తగూడెం నగరపాలక సంస్థకు సంబంధించిన 60 డివిజన్ల ఓటర్ల జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్ సుజాత నగరపాలక కార్యాలయంలో విడుదల చేశారు.
మొత్తం మహిళలు 70,314, పురుషులు 64,431, ఇతరులు 30 మొత్తం 1,34,775 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇల్లెందు మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ మేనేజర్ అంకుషావలి విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 33,723, వారిలో పురుషులు 16,222, మహిళలు 17,497, ఇతరులు నలుగురు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డుల్లో 16,850 మంది ఓటర్లు ఉన్నట్లు ఫొటోతో కూడిన జాబితాను కమిషనర్ బి.నాగరాజు విడుదల చేశారు. వీరిలో మహిళలు 8,761 మంది, పురుషులు 8,085 మంది, ఇతరులు 4 ఉన్నట్లు వివరించారు.