భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరాయి. భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి భక్తులు మురిసిపోయారు. పూజా కార్యక్రమాల అనంతరం తిరువీధి సేవకు పల్లకిలో వస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
భద్రాచలం, డిసెంబర్ 14 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రెండో రోజు భద్రాద్రి రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వగా.. స్వామివారిని చూసి మురిసిపోయారు. ఉదయం స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత స్వామివారికి వేద విన్నపాలు చేశారు. అనంతరం స్వామివారిని అంతరాలయంలోకి తీసుకెళ్లి కూర్మావతారంలో అలంకరించి బేడా మండపానికి తీసుకొచ్చి అర్చనలు చేశారు. నాలాయిర దివ్య ప్రబంధంలోని 200 పాశురాలు, వేద పారాయణం పఠించారు. తర్వాత స్వామివారికి రాజభోగం సమర్పించారు. బేడా మండపంలో స్వామివారిని భక్తుల దర్శనార్థం ఉంచి మధ్యాహ్నం 2 గంటలకు సమస్త మంగళవాయిద్యాలు, వేద పండితుల వేద ఘోషలతో, కోలాట నృత్యాలతో గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి హారతులు సమర్పించి.. అర్చనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కూర్మావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామివారిని తిరువీధి సేవలో భాగంగా విశ్రాంత మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై కొంతసేపు ఉంచారు. అనంతరం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. పల్లకిలో వస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రహదారులకిరువైపులా కిక్కిరిసిపోయారు. తమ ఆరాధ్య దైవానికి హారతులు, వివిధ రకాల ఫలాలు సమర్పించి పరవశించిపోయారు. అవతార విశిష్టతను ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి భక్తులకు వివరించారు. మిథిలా ప్రాంగణంలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణవాసులను, భక్తులను అలరించాయి. సాయంత్రం 6 గంటలకు పట్టణానికి చెందిన లాస్యప్రియ చేసిన కూచిపూడి నృత్యం, హైదరాబాద్కు చెందిన శర్వాణి, కార్తీక చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శనను భక్తులు తిలకించారు. రాత్రి 9 గంటలకు ప్రదర్శించిన శ్రీవరలక్ష్మీ నాట్య మండలి, తెనాలి వారిచే ప్రదర్శించిన గయో పాఖ్యానం నాటక ప్రదర్శన ఎంతగానో మెప్పించాయి.
భద్రాద్రి రామయ్య శుక్రవారం వరాహావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభువుని.. బ్రహ్మాదుల మొర విన్న శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి వరాహావతారాన్ని ధరించి.. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ క్రమంలో ఆటంకం కలిగించిన లోకంటు అయిన హిరణ్యాక్షుడు అనే దానవుడిని సంహరించి భూమిని రక్షించాడు. రాహు, గ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే ఆ బాధల నుంచి విముక్తులవుతారని ప్రశస్తి.