ఖమ్మం, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థసారథిరెడ్డి.. వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గురువారం ఖమ్మం కలెక్టరేట్‌కు వెళ్లిన ఆయన.. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రూ.కోటిని ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యలకు, వరద బాధితులకు ఉపశమనం కలిగించే పనులకు వినియోగించాలని కోరారు.
వర్షం సృష్టించిన బీభత్సానికి ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో వేలాదిమంది నిరాశ్రయులు కావడం తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తిగా, ఖమ్మంతో అనుబంధం ఉన్న విద్యార్థిగా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడం తన తక్షణ కర్తవ్యంగా భావించినట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల వల్ల అక్కడి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. అందుకని ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి కూడా కోటి రూపాయలను వరద సహాయక చర్యల కోసం విరాళంగా అందించినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న తన జిల్లా ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు.
అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేందుకు తమ సింధు ఆసుపత్రి నుంచి వైద్యబృందాలు, మందులు, రెండు అంబులెన్సులను ఖమ్మం కలెక్టర్‌కు అప్పగించినట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తమ హెటిరో సంస్థ.. సేవా కార్యక్రమాల్లో అగ్రగామిగా ఉంటుందని గుర్తుచేశారు. గత వరదల సమయంలోనూ తాను ఖమ్మం కలెక్టర్‌కు రూ.కోటి విరాళం అందజేసినట్లు జ్ఞప్తికి తెచ్చారు. అనంతరం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పార్థసారథిరెడ్డి సేవాభావానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీజ, డీఎంహెచ్‌వో సుబ్బారావు పాల్గొన్నారు.