కారేపల్లి, డిసెంబర్ 23 : కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం కారేపల్లి మండలం మాణిక్యారంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో విపక్షాల నిరసనల మధ్యలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి వీబీ జి రామ్ జి బిల్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించడం పని పొందే రాజ్యాంగ హక్కును హరించడమే అవుతుందన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని 2005 వామపక్షాల మద్దతుతో యూపీఏ`1 ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు.
ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపడంతో పాటు ప్రజలకు పని గ్యారెంటీ ఊసు లేకుండా బిల్లు తీసుకు రావడం ఆందోళనకరమన్నారు. కూలీలు పనిచేసే హక్కును హరించే ఉపాధి చట్ట సవరణను నిలుపుదల చేయాలని, ఉపాధి హామీ గ్యారెంటీ చట్టం యధాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, రవి, నాగేశ్వరరావు, వీరబాబు, సైదులు, లక్ష్మీ, ఉమావతి, సరస్వతి, పుల్లమ్మ, సుగుణమ్మ, నాగమణి పాల్గొన్నారు.