భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9 (నమస్తే తెలంగాణ)/పాల్వంచ/ఆళ్లపల్లి/ జూలూరుపాడు/ మణుగూరు టౌన్ : జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది. దీంతో ముర్రేడు, మసివాగు, కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. దుమ్ముగూడెం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీతవాగులో వరద నీరు ప్రవహిస్తోంది. నారచీరల ప్రాంతం నీటిలో మునిగింది. గుబ్బలమంగి ప్రాజెక్టులోకి వర్షపు నీరు చేరడంతో అలుగుపై నుంచి నీరు పారుతోంది. పాల్వంచలో మంగళవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమ యమయ్యాయి. వెంగళరావు కాలనీ, ప్రశాంత్ కాలనీ, ఇందిరా కాలనీ, వికలాంగుల కాలనీ, శివనగర్, సోనియా నగర్, నవ భారత్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. పట్టణంలోని డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి మురుగు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
బస్టాండ్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోకి నీరు చేరడంతో చెరువును తలపిం చింది. ఆళ్లపల్లి మండలంలో ఉదయం నుంచి వర్షం కురు స్తోంది. అనిశెట్టిపల్లి వద్ద గల పుణ్యపు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం, కాకర్ల, మాచినేనిపేటతండా, కొమ్ముగూడెం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మణుగూరు మండలంతోపాటు పట్టణంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. సుందరయ్య నగర్, వినాయక నగర్ ప్రజలు వరద నీటితో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కట్టు వాగు ఉధృతంగా ప్రవహించింది. సమితిసింగారంలోని అగ్ని మాపక కేంద్రం పరిసరాలు పూర్తిగా నీట మునిగాయి. సింగరేణిలో ఓబీ వెలికితీతకు అంతరాయం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందు బాటులో ఉంచారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టీబీ జాయింట్ డైరెక్టర్ రాజేశం రెం డు రోజుల క్రితం వైద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.