మామిళ్లగూడెం, మార్చి 6 : ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణపై ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై పలు కీలక సూచనలు చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
అధికారులందరూ గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు ఉన్న ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. కేవలం పథకాలే కాదు.. రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు రైతువేదికల ద్వారా ఆధునిక సాంకేతికత, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. విచ్చలవిడిగా ఎరువులు వాడకుండా భూసార పరీక్షలు చేయించుకునే బాధ్యత ఏఈవోలు, ఏవోలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటలైజేషన్ కన్నా ముందు కనీస సౌకర్యాల కల్పనకు దృష్టి సారించాలన్నారు.
ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న బాలికలు పాఠశాలలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటి మరమ్మతులు చేపట్టాలని కోరారు. డిజిటలైజేషన్ కోసం అవసరమైన నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు అందించిన న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రస్తుతం నిలిచిపోయిందని, దీనివల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల ప్రయోజనార్థం ఈ కిట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పర్యావరణ పరిరక్షణను పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమం నిర్వహించాలన్నారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడదలను అరికట్టాలని అధికారులను కోరారు. హోటళ్లు, ఫుడ్ సెంటర్లలో ఆహార తయారీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కేవలం రోటీన్ కార్యక్రమంలా కాకుండా ఆశించిన స్థాయిలో మార్పులు తీసుకరావాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.