మామిళ్లగూడెం, ఆగస్టు 6: ప్రజా సమస్యలపై పనిచేయడానికి పదవి మాత్రమే గీటురాయి కాదని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఖమ్మం జిల్లా పరిషత్‌లో అర్థవంతమైన చర్చలు జరిగాయని గుర్తుచేశారు. ఖమ్మంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ సాధారణ సమావేశంతోపాటు పాలకమండలి వీడ్కోలు సభను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాతా మధు మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లకాలంలో చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేశారని గుర్తుచేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలను తెలుసుకొని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి పాటుపడ్డారని జ్ఞప్తికి తెచ్చారు.
రాజకీయాల్లో పదవులు వస్తూపోతూ ఉంటాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. అయితే తమకు పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవకే అంకితమవుతున్నామని అన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమంతోపాటు జిల్లా అభివృద్ధికి అవసరమైన సేవలను అందించామని, ఇకముందు కూడా అందిస్తామని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా పనిచేశానని వివరించారు.
ముందుగా జడ్పీ చివరి సాధారణ సమావేశంలో భాగంగా ప్రజారోగ్యం, పశువుల ఆరోగ్య స్థితిపై చర్చించారు. జడ్పీ సీఈవో వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. సీజన్ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ సీజన్ కొనసాగుతున్నందున పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఐదేళ్లపాటు పాలకవర్గానికి సహకారం అందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఐదేళ్లపాటు జడ్పీ పాలకవర్గానికి చైర్మన్‌గా సేవలందించిన చైర్మన్ లింగాల కమల్‌రాజు దంపతులను ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ సీఈవో వినోద్, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు సన్మానించారు. అనంతరం జడ్పీటీసీలను, మాజీ ఎంపీపీలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, జడ్పీ సీఈవో వినోద్ సన్మానించారు. జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.