తిరుమలాయపాలెం, డిసెంబర్ 22 : నూతనంగా బాధ్యతలు స్వీకరించే పంచాయతీ పాలకవర్గాలు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ కోరారు. తన స్వగ్రామమైన పిండిప్రోలులో పంచాయతీ ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచ్ కామళ్ల సువార్త, ఉప సర్పంచ్ చామకూరి రాజుకుమార్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సభలో తాతా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ఊరు నుంచి అనేక మంది పోరాటాలు చేసి తమ ప్రాణాలను అర్పించినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీల నాయకులు సమష్టిగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. తాను పుట్టిన ఊరి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతలో విద్యా విజ్ఞానం పెంపొందించే లక్ష్యంతో తన కోటా నిధులు రూ.30 లక్షల వ్యయంతో పంచాయతీ భవనంపై నూతన గ్రంథాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో బొడ్రాయి(నాభిశిల)ను ప్రతిష్టింపజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ కామళ్ల సువార్త, చామకూరి రాజు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, ఎంపీడీవో షేక్ శిలార్ సాహెబ్, పంచాయతీ కార్యదర్శి రాము, మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు పంచాయతీ నూతన పాలకవర్గంతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో తాతా మధు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్, సీపీఎం, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పిండిప్రోలు, పాపాయిగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.