ఖమ్మం, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేని రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లదీస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాతా మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా రేవంత్‌రెడ్డి పాలన ఉందన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకనవుతాను అని చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారం రాగానే ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అణచివేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పోలీస్స్టేషన్లు, కేసులు కొత్తేమీ కాదన్నారు. బెదిరింపులకు భయపడతామని అనుకోవడం కాంగ్రెస్ నాయకుల అవివేకమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థతో రాజ్యమేలాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో మరింత చులకన అవుతారన్నారు.
ఈ నెల 9వ తేదీ నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా గొంతెత్తుతాం అన్నారు. మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలపై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరినీ ఆశ్చర్యపరిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్ష నాయకులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడే భాష తీరుకు ప్రజలు ఛీ కొడుతున్నారని, ముఖ్యమంత్రి వచ్చి అబద్దాలు చెప్పుతున్నాడని, చివరికి దేవుళ్లను కూడా మోసం చేస్తున్నాడన్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు ముమ్మాటికి రేవంత్‌రెడ్డే కారణమన్నారు. గురుకుల పాఠశాలలో చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విషయాలపై రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకులను అణచివేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను న్యాయస్థానాల వేదికగా ఎదురొంటామని అన్నారు.
ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతులను అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం తరంకాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మంరూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు శెట్టి వీరభద్రం, డేరంగుల బ్రహ్మం, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, గుండ్లపల్లి శేషగిరిరావు, లింగనబోయిన సతీష్, మహర్షి, సద్దాం షేక్, బలుసు మురళీకృష్ణ పాల్గొన్నారు.