ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో- లెవల్ బ్రిడ్జి పనులను స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. అకారణంగా పనులు నిలిచిపోవడం వల్ల గ్రామ ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రూ.75 లక్షల పరిపాలన అనుమతులతో అధికారులు మార్కింగ్ ఇచ్చి పనులను ప్రారంభించగా.. కొద్దిమంది అధికార పార్టీ నాయకులు అధికారులను బెదిరించి కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
బ్రిడ్జి పనులు కొనసాగితే సస్పెండ్ చేయిస్తామని, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, దీంతో ఎవ్వరు కూడా ఇటువైపు తొంగిచూడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదన్ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలే తప్ప అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. గత రెండున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం సాధించిందేమీలేదన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా పాలన సాగిస్తూ చివరకు ప్రజోపయోగకరమైన బ్రిడ్జి పనులను సైతం ఆటంకపర్చడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మసలుకోవాలని, లేదంటే ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. సంబంధిత అధికారులతో తాను మాట్లాడతానని, పగిడేరు వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని, రైతులందరికీ సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా యాప్‌ల ద్వారా కాకుండా నేరుగా షాపుల్లో లభ్యమయ్యేలా, పట్టాదారు పాస్‌బుక్‌లతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు సరిపడా అందించాలని కోరారు. కార్యక్రమంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, స్థానిక సర్పంచ్ డేరంగుల వెంకటరమణ, పోట్ల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, బోడపోతుల బాబు, దొడ్డపనేని రామారావు, కిలారు మాధవరావు, సర్పంచ్ పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీనివాసరావు, ఉపసర్పంచులు సోందు, కృష్ణ, దావ విజయ్‌కుమార్, అనుముల శ్రీను, వడ్లకుంట సతీష్, షేక్ ఖాదర్‌బాబు, జట్ల శ్రీను, కాశిమల్ల సతీష్, ఎర్ర కృష్ణయ్య, ఇజ్జగాని రామారావు, బత్తుల వెంకన్న, కొణిజర్ల మండలం సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు.