కూసుమంచి (నేలకొండపల్లి), జూలై 2: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలేరులో 67 వేల ఎకరాలకు నీరందించే భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని గుర్తు చేశారు. నేలకొండపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఏమీ పూర్తి చేయడం లేదని, ముగ్గురు మంత్రులు ఉన్నా కొత్తగా తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు.
పూటకో అబద్ధం చెబుతూ కాలం గడుపుతున్నారని, రైతులకు సన్న వడ్లకు బోనస్ డబ్బులు వేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. సీతారామ కాల్వ పనుల్లో ఆలస్యం జరుగుతున్నదని, రైతులకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కమిటీలు, కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇండ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెల్లో పారిశుధ్యం లోపించిందని అన్నారు.. రాష్ట్ర అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలోనే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, దీనిని గమనిస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
కేసీఆర్ను విమర్శించడమే సీఎం రేవంత్రెడ్డి పనిగా పెట్టుకున్నారని, పాలనపై కనీసం దృష్టి పెట్టడం లేదని, రైతుల సమస్యలను విస్మరించారన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, నంబూరి సత్యనారాయణ, మరికంటి రేణుబాబు, కోట సైదిరెడ్డి, అనగాని నర్సింహారావు, ఎండీ వాజీద్, బానోత్ శంకర్లింగం, ఎలమంద, దాసరి ఉదయ్, ప్రసాద్, వెంకటనర్సయ్య, అప్పారావు, పిచ్చయ్య, నాగేంద్రబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు.