మధిర, జూన్ 22 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి కూడా భట్టి విక్రమార్క తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ ఆయన నియోజకవర్గమైన మధిరలో ఎక్కడా లక్ష్మీకళ లేదని చురకలంటించారు. ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ అత్యంత దరిద్రంగా ఉన్నాయని, కరెంటు కోతలూ ఎక్కువేనని ధ్వజమెత్తారు. తాము వస్తున్న మార్గంలో రోడ్ల దుస్థితిని, తమ సభల్లో గంటలపాటు కొనసాగిన కరెంటు కోతలను కళ్లారా చూస్తున్నామని అన్నారు.
ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశాలపై పార్టీ మధిర నియోజకవర్గ బూత్‌స్థాయి ఏజెంట్లకు జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన మధిరలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో రవీందర్రావు మాట్లాడారు. రెప్పపాటు కూడా కరెంటు పోనివ్వబోమని ఉపన్యాసాలు దంచికొట్టిన ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే దారుణమైన కరెంటు కోతలు ఉన్నాయని దుయ్యబట్టారు. నిధులన్నీ ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్‌కు వెళ్తుంటే.. ఉప ముఖ్యమంత్రి విక్రమార్క కళ్లప్పగించి చూస్తున్నారని, కనీసం తన నియోజకవర్గానికీ నిధులు తెచ్చుకునే సోయిలో కూడా లేరని విమర్శించారు.
మధిర నుంచి భట్టి గెలిస్తే సీఎం అవుతాడంటూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పుకున్నారని, డబ్బుల సంచులు తెచ్చి కుమ్మరించి గెలిపించారని ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అయితే, అత్యంత కీలకమైన ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ బూత్‌స్థాయి ఏజెంట్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉన్నందున బీఆర్ఎస్ బూత్‌స్థాయి ఏజెంట్లు కాపలా ఉండి మరీ ఆ ఓట్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు గుర్తుచేయాలని, డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు.
మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవకపోయినా, పదవులు మారినా గులాబీ జెండాను భుజాన వేసుకొని పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ గ్రేట్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మధిర నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ పదవిని ఇచ్చారని, చింతకాని మండలంలో దళితబంధును అమలుచేశారని, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు వారి బూత్ పరిధిలో ఎమ్మెల్యేలతో సమానమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను అడ్డుకుంటూ బీఆర్ఎస్ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని 10కి 10 స్థానాలు గెలిచి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. గత కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకే రిబ్బన్లు కట్ చేసేందుకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ని, ప్రగతిభవన్‌ను తీవ్రంగా దూషించారని ఎమ్మెల్సీ తాతా మధు గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక అదే ప్రగతిభవన్‌లో నివాసం ఉంటున్నారని మండిపడ్డారు. నాడు ఈ ప్రగతిభవన్‌ను రాష్ట్ర అభివృద్ధి సీముల చర్చలకు వేదికగా కేసీఆర్ మలిచారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు భట్టి మాత్రం అదే ప్రగతిభవన్‌ను కమీషన్ల కోసం వాడుకుంటూ దాన్ని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మొండితోక లత, బికి కృష్ణప్రసాద్, మంకెన రమేశ్, బానోతు కొండా, చావా వేణు, రంగిశెట్టి కోటేశ్వరరావు, వేమూరి ప్రసాద్, జయకర్, లక్ష్మీరెడ్డి, సామినేని హరిప్రసాద్, పొనుగోటి రత్నాకర్, శీలం కవిత, గురజాల హనుమంతరావు, బొగ్గుల భాసర్‌రెడ్డి, అరెగ శ్రీను, యన్నంశెట్టి అప్పారావు, రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వర్లు, చిత్తూరు నాగేశ్వరరావు, బంధం నాగేశ్వరరావు, చుంచు విజయ్, కొల్లూరు శ్రీనివాసరావు, పారా ప్రసాద్ పాల్గొన్నారు.
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని నమ్మిన మహోన్నతుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు. అందుకే దేశ చరిత్రలో మొదటిసారిగా రైతుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేశారని గుర్తుచేశారు. మధిరలో బీఆర్ఎస్ జెండా ఎగరేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు.