రఘునాథపాలెం/ కూసుమంచి(నేలకొండపల్లి), జూలై 2 : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును ఢిల్లీకి పంపి కాంగ్రెస్ చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. ఇటీవల మృతిచెందిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఖమ్మంజిల్లాకు వచ్చారు. ఖమ్మం నగరంలోని కవిరాజ్‌నగర్‌లో ఉన్న మదన్‌లాల్ ఇంటికెళ్లిన కవిత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మదన్‌లాల్ ఆకస్మిక మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు.
ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అమలు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. బీసీ బిల్లును ఆమోదించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. బీసీ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 17వ తేదీన రైలురోఖో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలు ఒక్కటీ కదలకూడదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, రాష్ట్ర నాయకులు బానోతు కిషన్‌నాయక్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సిహాపురంలోని జాగృతి రాష్ట్ర సభ్యురాలు అనితాచౌదరి తండ్రి నమోతు నర్సింహారావు కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సింహారావు చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ పాలనను గుర్తు చేసుకొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలకు భద్రత లేకుండా పోయిందన్నారు.