ఖమ్మం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు ఇటీవల నిర్వహించిన కులగణనలో బీసీలకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్.. పదేళ్ల తరువాత తన పోరాట స్ఫూర్తిని మరోసారి రగిలించింది. ఇప్పటికే బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ మెడలు వంచిన బీఆర్ఎస్.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను సమీకరించే మరో ఉద్యమానికి సిద్ధమైంది. బీసీలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు బరిగీసి రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పలు జిల్లాలో పర్యటిస్తూ కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగడుతున్నారు. అనేక విషయాల్లో కాంగ్రెస్‌కు వణుకు పుట్టిస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా శనివారం ఖమ్మంలో పర్యటించనున్నారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తరువాత ఆ మాట తప్పి బీసీలను మళ్లీ మోసం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో నిర్వహించే బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత హాజరుకానున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఖమ్మం జిల్లాలోని అన్ని పార్టీల నుంచి బీసీ సంఘాల నేతలు, తెలంగాణ జాగృతి సభ్యులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో బీసీలకు జరిగిన అన్యాయంపై నిర్వహించే మరో ఉద్యమానికి ఖమ్మం కేంద్రం కానుంది.
తెలంగాణ ఉద్యమం మలుపుతిరగడంలో ఖమ్మం ఎలా కేంద్రబిందువైందో.. ఇప్పుడు బీసీలకు జరిగిన అన్యాయంపై జరిగే ఉద్యమంలోనూ ఖమ్మం కీలకమవుతోంది. ఉద్యమ జెండాను ఎత్తి పోరాటానికి సన్నద్ధమవుతోంది. ఇందుకు ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. వివిధ కులాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉద్యమంలో పాల్పంచుకోనున్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి మద్దతుగా ఖమ్మం జిల్లాలోని బీసీ నాయకులు కదుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని వారు మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఖమ్మంలో జరుగనున్న ఎమ్మెల్సీ కవిత పర్యటన వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వెల్లడించారు.