దుమ్ముగూడెం, ఫిబ్రవరి 19 : క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, స్నేహభావం పెంపొందుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం వైద్యశాల పక్కన క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తెల్లం మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
యువత చెడువైపు కాకుండా.. ఆటలపై దృష్టి సారించి మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ప్రీమియర్ లీగ్లో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు, షీల్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, ఎంపీపీ రేసు లక్ష్మి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావు(శివాజీ), క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.