తల్లాడ, జూలై 14: కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణలో వ్యవసాయాన్ని కల్లోలం చేస్తుందని సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పండుగ చేసిన వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేసేందుకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, అందుకే పంటల సాగుకు మూడు గంటల కరెంటు చాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్సే గనుక గెలిస్తే రేవంత్ మాటలు నిజమవుతాయని, దీంతో రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు మొదలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదని, మూడు గంటల విద్యుత్ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో తల్లాడలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ పాలనలో మాదిరిగా కర్షకులను మళ్లీ కష్టాలపాలు చేసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారని, రైతులను మళ్లీ రాత్రిపూట లాంతర్లతో పొలాలకు పంపాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే మళ్లీ ఇవే కష్టాలు పునరావృతమవుతాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శేషగిరిరావు, శ్రీనివాసరావు, వీరమోహన్‌రెడ్డి, వెంకట్‌లాల్, భద్రరాజు, వెంకటనరసింహారావు, కిరణ్‌బాబు, కోటారెడ్డి, జీవీఆర్, జమలయ్య, రాజశేఖర్‌రెడ్డి, సత్యం, వెంకటి, రామిరెడ్డి, నాగయ్య, శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, దాసురావు, మురళి, చలపతిరావు, వెంకటేశ్వరరావు, లక్ష్మణ్‌రావు, వీరకృష్ణ, నరేశ్రాజు, శశి తదితరులు పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన వినూత్న ప్రదర్శన..
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి కరెంటు ఇవ్వకుండా రైతులను ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో వివరించేలా ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. నాడు కర్షకులు అనుభవించిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రాక్టర్‌పై ఓ వైపున రేవంత్‌రెడ్డి బొమ్మను, మరో వైపున రైతుకు అతడు ఉరి వేస్తున్నట్లుగా తయారు చేసిన బొమ్మను ఉంచి నిరసన తెలిపారు. అలాగే గత కాంగ్రెస్ పాలనలో పొలాలకు మోటారు నీళ్లు పెట్టేందుకు రాత్రిళ్లు రైతులు లాంతర్ల తో వెళ్లే సన్నివేశాలను, మోటార్లు కాలిపోయిన ఘటనలను, రైతులు పొలం వద్దనే గుడిసెలు వేసుకొని చీకట్లలోనే ఉన్న దృశ్యాలను గుర్తుచేసేలా ప్రదర్శన చేశారు. తొలుత వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి నారాయణపురం నుంచి నుంచి మొదలైన భారీ నిరసన ర్యాలీ తల్లాడ ఎంపీడీవో కార్యాలయం వరకు కొనసాగింది.