సారపాక, సెప్టెంబర్ 10 : దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాయి. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరడంతో వారికి రేగా గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే అన్నివర్గాల సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి నేతలు వలస వస్తున్నారన్నారు.
సంక్షేమ పథకాలన్నీ సజావుగా అందాలంటే మరోమారు సీఎం కేసీఆర్ నాయకత్వం రావాలని, ఆయనతోనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, 24గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. 44 లక్షల మందికి రాష్ట్రంలో ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని, ఆ ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. కార్యక్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి, ఉప సర్పంచ్ ఎడమకంటి ఝాన్సీలక్ష్మి, గుల్మహ్మద్, సాధిక్‌పాషా, ఖాదర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.