ఖమ్మం రూరల్, అక్టోబర్ 21 : రాబోయే ఎన్నికల్లో పాలేరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని సాయిగణేష్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60వ డివిజన్ రామన్నపేట కాలనీకి చెందిన పలు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. డివిజన్ కార్పొరేటర్ బీ నిరంజన్ ఆధ్వర్యంలో జంగం నవీన్, ఎస్కే భాషా, ఆశూ, ఫియాజ్, గోపీ బాబా సాహెబ్‌తో సహా మొత్తం 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ ఎమ్మెల్యే గులాబీ జెండా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎవరెన్ని కుయుక్తులు, కుట్రలకు తెరలేపిన చివరకు పాలేరు ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడుతారన్నారు. ఎన్నికలు రాగానే ఒకరిమీద ఒకరు పోటీపడి ప్రజలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు. వలస వాదులకు వచ్చే ఎన్నికల్లో ఘోర ఫరాభవం తప్పదన్నారు. సీఎం కేసీఆర్ అంటేనే ప్రజ సంక్షేమ ప్రధాత అని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సీఎం కేసీఆర్‌ను మారోసారి ఆశిర్వదించే విధంగా పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.