మణుగూరు టౌన్, ఫిబ్రవరి 3: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా పోరు సాగించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆరు లక్షల మంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్రైవర్లకు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని, ఆయిల్‌పాం రైతులకు రూ.15 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ నెల ఆసరా పెన్లన్లను, రైతుబంధు సాయన్ని ఇప్పటికీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్థిక మంత్రి భట్టి ఉన్నప్పటికీ ఒరిగిందేమీలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నీటిలో 50 శాతం వాటా తెలంగాణకే ఉండాలని కేసీఆర్ నేతృత్వంలో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రాజెక్టులన్నీంటినీ ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని, తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుల ఆశీస్సులతో మహబూబాబాద్ ఎంపీగా మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ మాలోత్ కవిత ప్రకటించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు తనకు 26 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.