ఇల్లెందు రూరల్, జూలై 6 : ఏళ్లతరబడి పోడు చేసుకుంటూ ఇబ్బందిపడిన గిరిజనుల పోడు గోస సీఎం కేసీఆర్ పట్టాలు అందజేస్తుండడంతో తీరిందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని రాఘబోయినగూడెంలో 225, సుదిమళ్ళలో 235, పూబెల్లిలో 202, మొండితోగులో 270, తిలక్‌నగర్‌లో 66, సీఎస్పీ బస్తీలో 60, లచ్చగూడెంలో 110, ధనియాలపాడు పంచాయతీలో 87 మంది పోడు రైతులకు గురువారం పట్టాలు పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు రైతులు అడవుల్లో ఎన్నో ఏళ్లుగా పోడు కొట్టుకొని జీవిస్తున్నారన్నారు. వారి ఇబ్బందులు తీర్చి.. వ్యవసాయం చేసుకునే విధంగా హక్కులు కల్పించడానికి సీఎం కేసీఆర్ పట్టాలు అందజేయడంతో సంతోషంగా ఉన్నారన్నారు. తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న పోడునే నమ్ముకున్న రైతుల కలను సాకారం చేశారన్నారు.
మండలంలోని 8 గ్రామ పంచాయతీలకు చెందిన 5,013 మంది రైతులకు 15,118 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పట్టాలు అందుకున్న రైతులకు రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందన్నారు. పోడు పట్టాలను అధికంగా అందుకుంటున్న నియోజకవర్గంగా ఇల్లెందు చరిత్రకెక్కిందన్నారు. పోడు పట్టాలు తీసుకున్న రైతులు ఇకపై నిర్భయంగా సాగు చేసుకోవచ్చన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, పెట్టుబడి సాయం, పంటలు పండించేందుకు పుష్కలంగా నీళ్లను సీఎం కేసీఆర్ అందిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. పోడు రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, గ్రామ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పోడు రైతులు పాల్గొన్నారు.
కామేపల్లి, జూలై 6 : పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. గురువారం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధి శ్రీరాంనగర్తండాలో పోడు రైతులకు ఎమ్మెల్యే పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పరిష్కరించడమే కాక పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేసి వారికి అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడంతోపాటు గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పట్టాలను అందించారన్నారు. మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు చెందిన 239 మంది లబ్ధిదారులకు 622 ఎకరాలకు సంబంధించిన పోడు భూముల పట్టాలను అందించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆంతోటి అచ్చయ్య, పీఏసీఎస్ తీర్థాల చిదంబరరావు, కోటమైసమ్మతల్లి దేవాలయ చైర్మన్ మల్లెంపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అజ్మీర విజయలక్ష్మి, సర్పంచ్ జర్పుల రామారావు, ఎంపీటీసీ గుగులోత్ గబ్రూనాయక్, తహసీల్దార్ కోట రవికుమార్, ఎంపీడీవో విజయభాస్కరరెడ్డి, ఏవో తారాదేవి, నాయకులు మూడ్ కృష్ణప్రసాద్‌నాయక్, హ్లేమానాయక్, బన్సీ, శ్రీను, రాందాస్, రామారావు, ఏపూరి పాపారావు, బానోత్ రాందాస్, అజ్మీరా రాజునాయక్, కన్నమాల రాంబాబు, ముప్పల రాము తదితరులు పాల్గొన్నారు.
10వేల మందికి పోడు పట్టాలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
ఐదు జీపీల్లో 641 మందికి పట్టాల పంపిణీ
దమ్మపేట, జూలై 6 : అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా ఐదు మండలాల్లో 10వేల మందికి పోడు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం విస్తృతంగా పర్యటించిన ఆయన గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. లింగాలపల్లి, జమేదారుబంజరు, పార్కలగండి, మల్కారం, పెద్ద గొల్లగూడెం, మారప్పగూడెం పంచాయతీల పరిధిలోని ఆయా గ్రామాల్లో 641 మంది పోడు సాగుదారులకు 1,345 ఎకరాల విస్తీర్ణంలో పోడు పట్టాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోడు రైతుల కష్టాలను తెలుసుకుని పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, అన్ని మతాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారని, గిరిజనులు ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉండాలన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటికి రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపారన్నారు. మల్కారం గ్రామంలో గిరిజనులు ఎమ్మెల్యే మెచ్చా, సీఎం కేసీఆర్‌ల ఫెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, తహశీల్దార్ స్వామి, ఎంపీడీవో నాగేశ్వరరావు, సర్పంచ్‌లు వాడే జయ, రూప్సింగ్, పాశం సుగుణ, తోట నాగమణి, జంగం, సాగర్, బీఆర్ఎస్ నాయకులు దొడ్డాకుల రాజేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, దారా యుగంధర్, వాసు, అబ్దుల్ జిన్నా, తాటి ప్రదీప్ చంద్ర, రఘు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు దండం పెట్టిన మహిళ
సీఎం కేసీఆర్ సారు చొరవతో ఎమ్మెల్యేగా మాకు పోడు పట్టాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు దండం పెట్టి కేసీఆర్ సారు చల్లగుండాలని ఓ వృద్ధురాలు ఆశీస్సులు అందించింది. దీంతో పలువురు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
పార్టీలకతీతంగా పోడు పట్టాలు
అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, జూలై 6 : నియోజకవర్గంలోని పోడు రైతులకు పార్టీలకతీతంగా పట్టాలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మల్లాయిగూడెం పంచాయతీ పరిధిలోని దిబ్బగూడెం, పండువారిగూడెం, అనంతారం, గాండ్లగూడెం, పెంచికలపాడు, వినాయకపురం కాలనీ, దబ్బతోగు గ్రామాల్లోని గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. తొలుత ఆయా గ్రామాల్లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రైతుబంధు ఇచ్చారా..? అన్ని ప్రశ్నించారు.
మూడోసారి సీఎం కేసీఆర్‌యే, మళ్లీ మీరే ఎమ్మెల్యే
మూడోసారి కేసీఆర్‌ను, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని దిబ్బగూడెం, పండువారిగూడెం, అనంతారం, పెంచికలపాడు, వినాయకపురం కాలనీతోపాటు పలు గ్రామాల గిరిజనుల వాగ్దానం చేశారు. ఆయా గ్రామాల్లో గిరిజనులు, మహిళలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు చేతబట్టుకొని.. మేళతాళాలు, పువ్వులు చల్లుతూ, బతుకమ్మలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. సర్పంచ్‌లు నారం రాజశేఖర్, దాసరి నాగేంద్రరావు, భూక్యా చిలకమ్మ, కంగాల పరమేశ్, పొడియం సత్యవతిల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ శ్రీరామూర్తి, జడ్పీటీసీలు వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు ఎంపీటీసీలు కుమారి, వాసం బుచ్చిరాజు, మారుతి లలిత, ఎంపీడీవో శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు మోహన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణరావు, కాసాని చంద్రమోహన్, యూఎస్ ప్రకాశరావు, సత్యవరపు సంపూర్ణ, తాడేపల్లి రవి, మాజీ ఎంపీపీ బరగడ కృష్ణ, నిర్మల పుల్లారావు, కలపాల శ్రీను, చిన్నంశెట్టి వెంకటనర్సింహం, నులకాని శ్రీను, ఆకుల శ్రీను, బిర్రం వెంకటేశ్వరరావు, నల్లపు లీలాప్రసాద్, పొడియం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.