భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (నమస్తే తెలంగాణ), నమస్తే నెట్వర్క్ : జీవో నెంబర్ 10ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అంటూ అంగన్వాడీలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల(ప్రజాభవన్) ఎదుట పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాభవన్లను ముట్టడి చేసి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ టీచర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, జూలై 1 వరకు 65 సంవత్సరాలు నిండిన టీచర్లు, హెల్పర్లను ఉద్యోగ విరమణ చేయాలని జారీచేసిన జీవో 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, సీపీఎం అనుబంధ సంఘం సీఐటీయూ నాయకులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.