ఖమ్మం, సెప్టెంబర్ 4: ఖమ్మం జిల్లాలో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని సూచించారు. ఖమ్మంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరదల కారణంగా ఖమ్మం నగరంలో సుమారు 5 వేల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 2,500 ఇళ్లు కలిపి మొత్తం 7,500 ఇళ్లు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వివరించారు. అధికారులు ఇంకా క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నారని, మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు వస్తాయని అన్నారు. గడిచిన వందేళ్లలో మున్నేటికి ఇంత వరద ఎన్నడూ రాలేదని అన్నారు.
అయినప్పటికీ ఒక్క ప్రాణనష్టమూ జరుగకుండా కలెక్టర్, సీపీ సహా ఇతర అధికారులు చర్యలు తీసుకున్నారని అన్నారు. వారి కృషిని అభినందిస్తున్నట్లు చెప్పారు. అలాగే, వరద ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తుమ్మల వివరించారు. ప్రతి ఇంటికీ నిత్యావసర సరుకులు ఇస్తున్నామని, అవసరమైతే రెండోసారి కూడా పంపిణీ చేస్తామని అన్నారు.
గురువారం నుంచి బాధితుల ఖాతాల్లో నగదును జమచేస్తామన్నారు. వరద తెచ్చిన బురదను తొలగించేందుకు 100 ట్రాక్టర్లు, 50 జేసీబీలు, 70 ట్యాంకర్లు పనిచేస్తున్నాయన్నారు. పునరావాస కేంద్రాలను మరికొద్ది రోజుల వరకూ కొనసాగిస్తామన్నారు. చాలా వరకు విద్యుత్ మీటర్లు తడిచినందున వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నాయన్నారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ పాల్గొన్నారు.