భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసి ఇప్పటికి 76 ఏండ్లు అయ్యిందని, దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
రైతులను రుణవిముక్తి చేసేందుకు రూ.2 లక్షల చొప్పున జిల్లాలో 57,983 మందికి రూ.415,27 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. భద్రాద్రి రామయ్యకు దూరప్రాంతాల నుంచి భక్తులు రావడానికి వీలుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో రైలుమార్గం కూడా వస్తుందన్నారు. స్టేడియం గ్రౌండ్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన వివిధరకాల వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి సందర్శించారు.
స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీను, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఏవో బాబూరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.