భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ ప్రత్యేకాధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి సీతక్క అన్నారు. ఆమె శనివారం ములుగు కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీ ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణ, ఉపాధి హామీ పథకం తదితరాంశాలపై చర్చించారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, చివరి రోజున ముగింపు కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఉత్తమ పంచాయతీలకు కలెక్టర్లు ప్రశంసాపత్రాలు ఇవ్వాలని ఆదేశించారు.
గంజాయి, గుట్కా, మద్యం వంటి దురలవాట్లకు వ్యతిరేకంగా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మంచినీటి ఎద్దడి నివారణ, పారిశుధ్య పనులకు 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవచ్చని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.10 కోట్లతో పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్, పంచాయతీరాజ్ ఇంజినీర్లు శ్రీనివాసరావు, మంగ్యా, ఏపీడీ రవి, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.