వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేని వ్యాఖ్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మండిపడింది. ఆ కరెంటుతో పొలం మడులకు నీరెలా పారిస్తాం.. పంటలెలా పండిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ హయాంలో పంటలు పండించేందుకు కరెంటు లేక.. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక.. లో వోల్టేజీతో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి.. సమయానికి నీరందక పంటలు ఎండిపోయి నరకం చూశామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు దిష్టిబొమ్మల దహనాల్లో పాల్గొన్నారు.
పంటలకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు భగ్గుమన్నారు. ఎక్కడికక్కడ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ డౌన్.. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రైతులతో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కారేపల్లి క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన నిరసనలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, వేంసూరు నిరసనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బోనకల్లు నిరసనలో జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు, కూసుమంచి నిరసనలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలో నిర్వహించిన నిరసనలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ శ్రీరామ్మూర్తి, చుంచుపల్లి మండలం పెనగడపలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎంపీపీ శాంతి, లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, పాల్వంచ పట్టణంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, సుజాతనగర్ మండల కేంద్రంలో సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
– ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రేవంత్ మాటలు సరికాదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 24 గంటలు విద్యుత్ అవసరం లేదనడం సరికాదు. మళ్లీ పాత రోజులే గుర్తు చేసేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచింది. రాష్ట్రంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారంటే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే కారణం. బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు తెలంగాణలో రైతులు అండగా ఉండి కంటికిరెప్పలా కాపాడుకుంటారు.
-యలమద్ది అప్పారావు, కొండాయిగూడెం రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు
గతంలో పొలాల్లోనే పడుకున్నాం
గత ప్రభుత్వాల పాలనలో త్రీఫేజ్ విద్యుత్ కోసం రాత్రంతా పొలాల్లోనే పడుకున్నాం. పట్టుమని నాలుగు గంటలు కరెంటు వచ్చేది కాదు. వచ్చినా లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోయాయి. కాంగ్రెస్ వస్తే 3 గంటలు విద్యుత్ ఇస్తామని రేవంత్‌రెడ్డి అనడం దారుణం. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదు. సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు వాడుకునే సౌలభ్యం ఉంది.
-సత్తి నాగేశ్వరరావు, రైతు, రేపల్లెవాడ, చండ్రుగొండ మండలం
మతిలేని మాటలు నమ్మొద్దు
ఉమ్మడి పాలనలో కరెంటు కోసం రైతులు పడిన కష్టాలను ఏ ఒక్కరూ మరిచిపోలేదు. రైతులకు 3 గంటలు విద్యుత్ ఇస్తానన్న మతిలేని రేవంత్‌రెడ్డి మాటలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. రేవంత్‌కు, ఆ పార్టీ నాయకులకు భవిష్యత్తులో రైతాంగం నుంచి వ్యతిరేకత తప్పదు. యావత్ రైతాంగం కలిసి మూడోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించుకొని 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి ఇప్పించుకుంటాం.
-బోగ్గారపు రాంబాబు, రైతు, కోదుమూరు, చింతకాని మండలం
3 గంటలకు గుంట తడవదు
3 గంటలు కరెంటు పంటలకు సరిపోద్ది అని రేవంత్‌రెడ్డి చీఫ్‌గా మాట్లాడితే రైతులు తిరగబడతారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ హయాంలో రాత్రీ పగలు తేడా లేకుండా ఎప్పుడు కరెంటు వచ్చేది.. పోయేది తెలిసేది కాదు. మోటార్ల వద్ద పడిగాపులు కాసిన రైతులు చివరికి కరెంటు షాక్‌తో చనిపోయిన ఘటనలను కళ్లారా చూశాను. కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇళ్లకే కాదు.. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చింది చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
-మండే వీరహనుమంతరావు, రైతు, సొసైటీ చైర్మన్, నాయకలగూడెం
తెలంగాణలో కరెంటు కోతలు లేవు..
తెలంగాణలో కరెంటు కోతలు లేవు. ఇక్కడ కరెంట్ పోతే వార్త. మిగతా రాష్ర్టాల్లో విద్యుత్ సరఫరా అయితే వార్త. రైతులు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొలానికి వెళ్లి పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. పంటలకు ఇంత నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చే రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు. రైతులకు మేలు జరుగుతుంటే ఓర్వలేకనే కాంగ్రెసోళ్లు ఉచిత విద్యుత్‌పై నోరు పారేసుకుంటున్నారు. కాంగ్రెసోళ్లను ఇప్పుడు రైతులు నమ్మే పరిస్థితి లేదు.
– వెలివెల కృష్ణయ్య, రైతు, పెనుబల్లి
రాష్ట్రం వచ్చినంకనే పంటలకు ఉచిత కరెంట్..
గతంలో ఏ ప్రభుత్వమూ పంటలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. ఉమ్మడి పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏడు గంటల విద్యుత్ ఇచ్చారు. కానీ ఆ ఏడు గంటలు ఎప్పుడు అని తెలిసేది కాదు. రైతులు పొలాల వద్దే కాపలా కాసేటోళ్లు. సగం పంట తడిసేలోపు కరెంటు పోయేది. మళ్లీ ఎప్పుడు తిరిగొస్తుందో తెలిసేది కాదు. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతుల కష్టాలు తీర్చారు.
– కొర్రం రాములు, రైతు, బ్రాహ్మలకుంట, పెనుబల్లి మండలం
రైతు కష్టం తెలియదు
రేవంత్‌రెడ్డికి రైతుల కష్టాలు తెలియదు. అవగాహన లేకుండా కరెంటు గురించి మాట్లాడడం బాధగా ఉంది. గత కాంగ్రెస్ హయాంలోనే కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కరెంటు లేక పంటలు ఎండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకుంటున్నారు. రెండు పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నాం.
-బర్మావత్ శివకృష్ణ, రైతు, పాతతండా, టేకులపల్లి మండలం
మూడు గంటలు సరిపోదు
మూడు గంటలు వ్యవసాయానికి సరిపోతుందని రేవంత్‌రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉంది. మూడు గంటల కరెంటు ఇస్తే ఎకరం భూమి తడపడానికి సరిపోతుందా.. కౌలు వ్యవసాయం చేస్తున్న నాకు కరెంటు నిరంతరం ఇవ్వకపోతే చాలా కష్టం. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుండడంతో పంటలు పండించుకుంటున్నా.
-షేక్ సైదులు, రైతు, గండగలపాడు, వైరా మండలం
గతంలో ఇబ్బందులుపడ్డాం
గత కాంగ్రెస్ పాలనలో సమయానికి కరెంటు లేక చాలా ఇబ్బందులుపడ్డాం. విద్యుత్ సబ్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తుండడంతో పంటలు పండించుకుంటున్నాం. ఉచితంగా కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత రైతులపై ఉంది.
-బొల్లెపోగు శ్రీను, రైతు, గండగలపాడు, వైరా మండలం
అవి మూర్ఖపు మాటలు..
మూడు గంటలు విద్యుత్ అవసరమని రేవంత్‌రెడ్డి మూర్ఖంగా మాట్లాడడం సిగ్గుచేటు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలకు పూనుకోవడం సరైంది కాదు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారు. మూడు గంటల విద్యుత్‌పై వ్యాఖ్యలు మానుకోకపోతే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు.
-యనగంటి వెంకటేశ్, రైతు, దుమ్ముగూడెం