రఘునాదపాలెం, అక్టోబర్ 1: కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శుంకుస్థాపన చేశారు. చిమ్మపుడిలో రూ.1.10 కోట్లు, కోటపాడు గ్రామంలో రూ.1.32కోట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన ప్రగతి నివేదికను మంత్రి ఆవిష్కరించారు.
చిమ్మపుడిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.85 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.12 లక్షలతో రెండు డొంక రోడ్లను ప్రారంభించారు. సుడా నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్స్‌ను మంత్రి ప్రారంభించారు. కోటపాడులో రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, రూ.17లక్షలతో నిర్మాణం చేసిన డొంకరోడ్లను ప్రారంభించారు. మరో రూ.40లక్షలతో ఏర్పాటు చేయబోయే బ్లాక్‌టాప్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారే యావత్ తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ, వారెంటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కహానీలను నమ్మవద్దని, వారి అబద్దపు వాగ్దానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు మాత్రం బంగారుగాజులు పెడాతా అంటే.. అయితదా అని మంత్రి ఎద్దేవా చేశారు. ఒక్క కోటపాడు గ్రామంలోనే రూ8.14కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. పుట్టగతులు లేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరించినా మళ్లీ ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కనీసం పార్టీని నడపలేని దద్దమ్మ రాహూల్‌గాంధీ అని, ఇక్కడ కేవలం ఇద్దరి కడుపునొప్పిని ప్రజలకు అంటగడతారా అని మంత్రి ప్రశ్నించారు.
రాజీనామా లేఖలో సహకరించిన బీఆర్ఎస్ నేతలకు ధన్యవాధలు ఆని రాశారని, సహకరిస్తే ఎవరైనా రాజీనామా ఎలా చేస్తారని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులు జట్టు కట్టి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గౌరీ, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, జడ్పీటీసీ ప్రియంక, సర్పంచ్ గొర్రె కృష్ణవేణి, గుండ్ల మత్తయ్య, గంగిరెడ్డి విజయ్‌రెడ్డి, కాంపాటి రవి, నాయకులు పాల్గొన్నారు.